గరిష్ట స్థాయిలో స్థిరీకరణకు అవకాశం
ముంబై: కొత్త సంవత్సరం తొలి వారంలో స్టాక్ సూచీలు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆటో సేల్స్ అమ్మకాలు, పీఎంఐ డేటా, ఎఫ్ఓఎంసీ మినిట్స్, ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలకాంశాలుగా ఉన్నాయి. ఆర్థిక అగ్రరాజ్యాలు అమెరికా, చైనాలు వెల్లడించే స్థూల ఆర్థిక గణాంకాలు ఈక్విటీ మార్కెట్ల దిశను ప్రభావితం చేసే వీలుంది. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రూపాయి కదలికలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించవచ్చు.
‘‘గత ఏడాది ట్రేడింగ్ చివరి వారంలో సూచీలు జీవితకాల గరిష్టాలను తాకడంతో ఏర్పడిన అధిక వాల్యుయేషన్ల కారణంగా సూచీలు కొద్ది రోజుల పాటు స్థిరీకరణకు గురయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అధిక కొనుగోళ్లు జరిగినందున, కొంత లాభాల స్వీకరణ ఉండొచ్చు. కావున ట్రేడర్లు స్థిరీకరణలో భాగంగా దిగివచి్చన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేసే వ్యూహాన్ని అమలు చేయాలి. ఈ వారం నిఫ్టీ ఎగువ స్థాయిలో 22,000 స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిపైన నిలదొక్కుకుంటే 22,200 వరకూ ర్యాలీ కొనసాగుతుంది. అనుకున్నట్లే లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 21,500 వద్ద బలమైన తక్షణ మద్దతు లభిస్తుంది’’ అని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ సాంకేతిక నిపుణుడు పర్వేశ్ గౌర్ తెలిపారు.
ఆటో అమ్మకాలు
ఆటో కంపెనీలు డిసెంబర్ నెల వాహన అమ్మకాలను నేడు(సోమవారం) విడుదల చేయనున్నాయి. టూ వీలర్స్ అమ్మకాలు రెండింతల వృద్ధి నమోదు చేయోచ్చని, ప్యాసింజర్ వాహనాలు, వాణిజ్య, ట్రాకర్ విభాగ విక్రయాల వృద్ధి ఫ్లాటుగా ఉండొచ్చని పరిశ్రమ వర్గాల అంచనా. విక్రయ గణాంకాలు వినియోగ డిమాండ్, పరిశ్రమ స్థితిగతులను తెలియజేస్తాయి.
ఎఫ్ఓఎంసీ మినిట్స్
ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ డిసెంబర్లో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ నిర్ణయాలు గురువారం వెల్లడి కాన్నాయి. ఈ 2024లో మూడుసార్లు వడ్డీరేట్ల కోత ఉండొచ్చనే అంచనాల నేపథ్యంలో ఎఫ్ఓఎంసీ మినిట్స్ కీలకం కానున్నాయి. అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణ అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.
డిసెంబర్లో రూ.66,000 కోట్లు పెట్టుబడులు
విదేశీ ఇన్వెస్టర్లు డిసెంబర్లో 66,000 కోట్ల పెట్టుబడులు పెట్టారు. యూఎస్ ఫెడ్ రిజర్వు ద్రవ్య లభ్యత పరిస్థితుల కఠినతరం ముగిసిందని సంకేతాలిచ్చింది. వచ్చే మార్చి నుంచి కీలక వడ్డీరేట్లు తగ్గిస్తామని తెలిపింది. దీంతో యూఎస్ ట్రెజరీ బాండ్ల విలువ భారీగా పతనమైంది. ఈ పరిణామాలతో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి డిసెంబర్లో విదేశీ నిధుల వరద పోటెత్తింది. ఇక 2023లో భారత్ ఈక్విటీ మార్కెట్లలో ఎఫ్‌పీఐలు రూ.1.71 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. స్టాక్ మార్కెట్లతో పాటు డెట్, హైబ్రీడ్, డెట్ –వీఆర్ఆర్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు రూ.2.37 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఎన్ఎస్డీఎల్ డేటా చెబుతున్నది. ఇండియన్ డెట్ మార్కెట్లో ఎఫ్‌పీఐ నికర పెట్టుబడులు రూ.68,663 కోట్లు ఉన్నాయి.