అసెంబ్లీ మీడియా పాయింట్ | assembly media point | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ మీడియా పాయింట్

Published Sun, Mar 8 2015 4:01 AM | Last Updated on Tue, Oct 9 2018 6:36 PM

అసెంబ్లీ మీడియా పాయింట్ - Sakshi

అసెంబ్లీ మీడియా పాయింట్

మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు
గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలతో ఉంది. పథకాల అమలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని మాటలు చెప్పి... మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు. రైతు ఆత్మహత్యలు, కరువు కాటకాలపై ఒక్క మాట కూడా ప్రసంగంలో పొందుపరచలేదు. కనీసం హైదరాబాద్‌లో కృష్ణా మూడో దశ గురించి ఊసేలేదు. కేవలం బలవంతంగా పన్ను వసూలు చేస్తూ ‘చెత్త’ నిర్ణయాలు తీసుకుంటున్నారు. గత బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన నిధుల్లో ఇప్పటికీ ఒక్కపైసా ఖర్చు చేయలేదు. పరిశ్రమల పునరుద్ధరణ, ఉద్యోగులకు 40 శాతం ఫిట్‌మెంట్ జీవో జారీ, పోస్టులు భ ర్తీ చేయకుండానే మాటలతో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.  - బీజేపీ శాసనసభ పక్షనేత లక్ష్మణ్
 
ఇంకా సిగ్గు, శరం రాలేదు
సభలో టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవ ర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని అవమానించారు. బండబూతులు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సభలో వీడియో రికార్డులు పరిశీలించి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడిన వారిని శిక్షించాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులైనప్పుడు ఏమైందీ మీ పౌరుషం? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏపీ సీఎం చంద్రబాబు కరెంట్ ఇవ్వకుండా నానాయాగీ చేస్తున్నారు. తెలంగాణలో టీడీపీ సగం ఖాళీ అయినా ఆ పార్టీ ఎమ్మెల్యేలకు సిగ్గు, శరం రాలేదు. ఇక నైనా బుద్ధి తెచ్చుకోండి.
 - మంత్రి జూపల్లి కృష్ణారావు

అసెంబ్లీకి ఇది చీకటి రోజు
తెలంగాణ అసెంబ్లీకి ఇది చీకటి రోజు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవాలని కోరితే.. టీఆర్‌ఎస్ రౌడీలు దాడి చేశారు. పోలీస్ సభలా ఉంది. రైతు ఆత్మహత్యలు, కరెంట్ కష్టాలు... ఇవన్నీ అడిగినందుకే మాపై దాడికి పాల్పడ్డారు. తెలంగాణ కోసం మీడియా కూడా ఉద్యమాలు చేసింది కానీ.. మంత్రి తలసాని మాత్రం ఉద్యమబాట పట్టలేదు. దాడికి పాల్పడిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. ఫిరాయింపుదారును సభ నుంచి సస్పెండ్ చేయాలి.  - ఎర్రబెల్లి దయాకర్ రావు, టీడీపీ శాసన సభాపక్షనేత

చెప్పుకోవడానికి ఏమీ లేకే ఆరోపణలు
పబ్లిసిటీ కోసం, చెప్పుకోవడానికి ఏమీ లేక ప్రతిపక్షం, విపక్షాలు ఆరాటం చేస్తున్నాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు సభ్యులు చేస్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక పోతున్నారు. గురువింద చందంగా... గతంలో వారు చేస్తే సరైందంట.. అదే ఇప్పుడు మేం చేస్తే తప్పుబడతారా?  సభ ఎలా నిర్వహించాలో, ఎలా నడుచుకోవాలో మాకు తెలుసు.
 - శ్రీనివాస్ గౌడ్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే

పోతుల్లా మేపి.. మాపై దాడికి దించారు
గవర్నర్ సాక్షిగా మందబలంతో టీఆర్‌ఎస్ మాపై దాడి చేసింది. మంత్రి హరీశ్‌రావు ఉసిగొల్పడంతోనే దాడికి దిగారు. సీఎం తమ ఎమ్మెల్యేలని పోతుల్లా మేపి విపక్ష నేతలపై దాడికి దించుతున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం... దొరతనానికి శుభదినం. మాపై దాడి చేసిన మార్షల్స్‌ని వెంటనే సస్పెండ్ చేయాలి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను సభకు అనుమతించకూడదు.
 - రేవంత్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే
 
టీఆర్‌ఎస్ కరపత్రాన్ని గవర్నర్ చదివారు
సీఎం కేసీఆర్ రాసిచ్చిన టీఆర్‌ఎస్ కరపత్రాన్ని గవర్నర్ సభలో చదివి వినిపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా సభలో సభ్యులు వ్యవహరించారు. కరువు, రైతు ఆత్మహత్యలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి సమస్యల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చకపోవడం ప్రభుత్వం ప్రాధాన్యానికి నిదర్శనం. సభలో హుందాగా నడుచుకోవాల్సింది పోయి బజారు రౌడీలుగా ప్రవర్తించారు.  - సీపీఐ శాసనసభా పక్షనేత రవీంద్రనాయక్

టీఆర్‌ఎస్‌కు పాడే కట్టేరోజులు దగ్గర్లోనే..
ప్రతిపక్ష, విపక్ష ఎమ్మెల్యేలను అణగదొక్కి తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కే ఆధిపత్యం ఎల్లకాలం ఉండదు. తోటి ఎమ్మెల్యేలపై దాడి చేసే పరిణామాలు జరుగుతాయని కలలోనూ ఊహించలేదు. తెలంగాణ శాసనసభలో ఇది చీకటి రోజు. టీఆర్‌ఎస్‌కు పాడే కట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అసెంబ్లీ, సచివాలయం, ప్రజల్లో, సభల్లో ఇలా ఒక్కోచోట ఒక్కోమాట సీఎం పలుకుతున్నారు. సీఎం తన ప్రవ ర్తన, వ్యవహార శైలిని మార్చుకోవాలి.
- డీకే అరుణ, కాంగ్రెస్ ఎమ్మెల్యే

కరువు మండలాల ప్రస్తావనే లేదు
తోటి సభ్యులపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దాడికి పాల్పడడం హేయం. గ్రామాల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నా... బాగుందని గవర్నర్ ప్రసంగంలో పొందుపర్చడం సభను పక్కదారి పట్టించడమే. కరువు మండలాల ప్రస్తావన లేకపోవడం దుర్మార్గం. సీఎం చెప్పేదానికి..  చేసే పనులకు పొంతన లేదు. అధికారంలోకి వచ్చాక కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామన్న హామీ ఎక్కడ పోయింది?  - సున్నం రాజయ్య, సీపీఎం ఎమ్మెల్యే

ఇదే మొదటిసారి
శాసనసభలో సభ్యులు కొట్టుకున్న సంప్రదాయం ఎప్పుడూ లేదు. అధికార పార్టీ సభ్యులే వెల్‌లోకి వెళ్లడం.. దాడులు చేయడం ఇదే మొదటిసారి. జాతీయ గీతాలాపన సమయంలోనూ అగౌరవంగా మెలిగారు. గోడలా మార్షల్స్‌ని పెట్టి సభ్యుల్ని నియంత్రించారు. ఇక గవర్నర్ ప్రసంగంలో రైతులకు ప్రాధాన్యత ఇవ్వలేదు.  - చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మాదెలా అనైతికం?
ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారు. దీన్ని తెలంగాణ సమాజం అవమానంగా భావిస్తోంది. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడడం చాలా దుర్మార్గం. జాతీయ గీతాన్ని అవమాన పరిచిన వారు చట్టసభలకు అనర్హులు. పార్టీ ఫిరాయింపులపై టీడీపీ సభ్యులు మాట్లాడడం హాస్యాస్పదం. ఏపీలో ఓ పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీలను టీడీపీ తమ పార్టీలోకి చేర్చుకుంది. అది తప్పుకానప్పుడు.. మాదెలా అనైతికం?  - కర్నె ప్రభాకర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement