సీఎం ఆదేశాలు సీఎండీ బేఖాతర్
ఐఎన్‌టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్‌ప్రసాద్
గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు సకల జనుల సమ్మె వేతనాలను చెల్లించాలని, ఇందుకు విధివిధానాలు రూపొందించాలని మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ఆదేశాలను సింగరేణి సీఎండీ శ్రీధర్ బేఖాతర్ చేస్తున్నారని ఐఎన్‌టీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ స్టాప్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్ ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సోమవారం మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత బోర్డు ఆఫ్ డెరైక్టర్ల సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన సింగరేణి సీఎండీ ఈ నెల 11న జరిగిన బోర్డు సమావేశంలో సకల జనుల సమ్మె వేతనాల చెల్లింపు అంశాన్ని కనీసం ఎజెండాలో కూడా పెట్టలేదని తెలిపారు.
ఈ క్రమంలో వారసత్వ ఉద్యోగాలు సాధిస్తామని ప్రకటిస్తున్న గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు ఎలా సాధిస్తాయో శాస్త్రబద్ధంగా చెప్పడం లేదని, ఇలాంటి హామీలు కార్మికులను ఆయోమయానికి గురిచేస్తున్నాయన్నారు. సింగరేణిలో వీఆర్‌ఎస్ కార్మికుల వారసులు, డిస్మిస్ కార్మికులు ఎంత మంది ఉన్నారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికుల విషయంలో కూడా ఎంత మందిని పర్మినెంట్ చేస్తారనే విషయాన్ని గుర్తింపు సంఘం ఎన్నికలకు ముందే ప్రకటించాలని కోరారు. సమావేశంలో నాయకులు బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, లక్ష్మీపతిగౌడ్, పి.ధర్మపురి, చంద్రయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, గడ్డం శేఖర్ పాల్గొన్నారు.
అసెంబ్లీలో ప్రకటన చేయాలి
సింగరేణి కార్మికులకు సకల జనుల సమ్మె వేతనాలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీ స్పష్టమైన ప్రకటన చేయాలి. దీనిపై ఇప్పటివరకు సింగరేణి యాజమాన్యానికి ఎలాంటి ఆదేశాలు రాలేదు. లీవులు కాకుండా నగదు రూపంలో వేతనాలు చెల్లించాలి. సకల జనుల సమ్మెకు ఊపిరి పోసి తెలంగాణ ఉద్యమాన్ని దిల్లీస్థాయికి తీసుకెళ్లిన సింగరేణి కార్మికులకు మంచి నజరానా ప్రకటించాలి. - రియాజ్‌అహ్మద్, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి (యైంటింక్లయిన్‌కాలనీ)
ఉద్యమానికి ఊపిరి పోసింది కార్మికులే..
సకలజనుల సమ్మెతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది సింగరేణి కార్మికులే. 45రోజులు సమ్మె చేసి సత్తాచాటిన ఘనత కార్మికులకే దక్కింది. తెలంగాణ ప్రకటించిన వెంటనే వడ్డీతో సహా సమ్మెకాలం వేతనం చెల్లిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు విధివిదానాలు రూపొందిస్తూ సంస్థకు ఆదేశాలు జారీ కాలేదు. నగదు రూపంలో సమ్మె వేతనాలు చెల్లిస్తామని అసెంబ్లీలో ప్రకటన చేయాలి.- వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూ ప్రధాన కార్యదర్శి(యైంటింక్లయిన్‌కాలనీ)