ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులు మారిన భూములపై కొనుగోలుదారులకు అనుభవించే హక్కులు ఇవ్వడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దారిద్య్రరేఖ దిగువ ఉన్న పేదలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. సాగు చేసుకొని జీవనం సాగించేందుకు ఈ భూములను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ భూముల క్రయ విక్రయాలు నిషేధం. ఎవరైనా భూమి అమ్మినట్లు తేలితే.. పీఓటీ చట్టం– 1977 ప్రకారం ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలా తిరిగి తీసుకున్నదానిని మరో భూమిలేని పేదకు పంపిణీ చేసే విచక్షణాధికారం కూడా ఉంది.
ధరలు నింగినంటడంతో..
భూముల విలువలు గణనీయంగా పెరగడంతో అసైన్‌మెంట్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా చోట్ల ఇవి పక్కదారి పట్టాయి. బడాబాబులు, ప్రజాప్రతినిధులు కారుచౌకగా ఈ భూములను కొల్లగొట్టారు. రికార్డుల్లో అసైన్డ్‌దారుల పేర్లే కొనసాగుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరాధీనమయ్యాయి. వీటిలో చాలావరకు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండగా.. కొంతమంది మాత్రం ఫామ్‌హౌస్, రిసార్టులుగా మార్చారు. మరికొందరు ఏకంగా ఈ భూముల్లో బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఇంజనీరింగ్ తదితర విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. పలుకుబడి గల వ్యక్తుల గుప్పిట్లో ఉన్న భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి తలకుమించిన భారంగా మారింది. దీంతో అటువైపు కన్నెత్తి చూసేందుకే సాహసించడం లేదు.
77వేల ఎకరాలు అన్యాక్రాంతం
జిల్లాలో ఇప్పటివరకు 87,064.35 ఎకరాలను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో 77,179.22(88.65%) ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అధికార యంత్రాంగం లెక్కతేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి విక్రయించిన 3,705.02 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూముల స్వాధీనాన్ని తప్పుబడుతూ 4,135 కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం ప్రహసనంగా మారింది. జిల్లావ్యాప్తంగా 25,697 మంది ఈ భూముల్లో పాగా వేసినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది.
క్రమబద్ధీకరణ ఇలా..!
ప్రభుత్వ తాజా నిర్ణయం ఈ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. గతంలో భూములు కొనుగోలు చేసినా.. అమ్మినా చట్ట విరుద్ధం. కొన్ని చోట్ల మాత్రం భూమిలేని పేదలు కొంటే వారికే కేటాయించేవారు. అయితే, ఇదంతా స్థానిక అధికారుల విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది. ఈ క్రమంలో తాజా నిర్ణయంతో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన భూమిలేని పేదలకు ప్రయోజనం కలుగనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదిలావుండగా, హెచ్‌ఎండీఏ పరిధిలో పరాధీనమైన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మన జిల్లా సింహభాగం హెచ్‌ఎండీఏ ఆధీనంలో ఉన్నందున.. ఈ ప్రయోజనం మారుమూల మండలాలకే వర్తించే అవకాశాలున్నట్లు తెలుస్తోందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాజాగా జరుగుతున్న రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళనలో భాగంగా.. చేతులు మారిన భూములపై స్పష్టత వచ్చిందని, అలాగే అందులో భూమిలేని పేదల జాబితాను కూడా సేకరించామని, దీని ఆధారంగానే వీటి బదలాయింపు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు.
జిల్లాలో పంపిణీ చేసిన అసైన్డ్ భూమి(ఎకరాల్లో)
అసైన్డ్ చేసిన భూమి లబ్ధిదారుల ఆధీనంలో పరాధీనం
87,064.35 9,885.13 77,179.22
Comments
Please login to add a commentAdd a comment