మాట్లాడుతున్న సీఐ నాయుడు మల్లయ్యస్వామి
వైరా : అతను బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేశాడు. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులతో నవ్వుతూ మాట్లాడి, మాటలతో మచ్చిక చేసుకుంటాడు. నమ్మకం కలిగేలా పరిచయాన్ని పెంచుకోవటంతో పాటు తోటి ఉద్యోగులకు కూడా టోకరా పెట్టి పరారీ అయ్యాడు. ఎట్టకేలకు వైరా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేశారు. ఆ వివరాలను వైరా సీఐ నాయుడు మల్లయ్యస్వామి బుధవారం విలేకరులకు తెలిపారు. కల్లూరుకు చెందిన పిల్లి సతీష్‌కుమార్ వైరా డీసీసీబీ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూ బ్యాంకుకు వచ్చి పోయే ఖాతాదారులు, రైతులతో పరిచయాన్ని పెంచుకొని ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు నగదును బదిలీ చేస్తూ మొత్తం 34 మంది ఖాతాదారుల ఖాతాలను వాడుకొని ఎవరికీ అనుమానం రాకుండా డిపాజిట్, విత్‌డ్రా చేయటం, ఓచర్‌లలో ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ.39,55,728 నగదును డ్రా చేసుకొని ఖాతాదారులకు కుచ్చుటోపీ పెట్టి ఊడాయించాడు. మరోవైపు బ్యాంకులో సహ ఉద్యోగుల ఐడీ, పాస్ వర్డ్‌లను వినియోగించి ఎవరికీ అనుమానం రాకుండా వ్యవహరించాడు.
గతేడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ
పిల్లి సతీష్‌కుమార్ గత ఏడాది నోట్ల రద్దు సమయంలో ఎక్కువ నగదును వినియోగదారులు ఖాతాలకు జమచేయమని ఇవ్వటం, ఇచ్చిన నగదును ఖాతాల్లో జమచేసి వినియోగదారులకు తెలియకుండానే నగదును మాయం చేశాడు. సతీ ష్‌కుమార్ వద్ద నుంచి రూ.39,55,528 నగదును స్వాధీనం చేసుకొని, ఖమ్మం డీసీసీబీ సీఈఓ వి వసంతరావు ఫిర్యాదు మేరకు అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి కోర్డుకు రిమాండ్ చేసినట్లు తెలిపారు. ఖాతాదారులు బ్యాంకులో లావాదేవీలు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైన బ్యాంకు ఖాతా నంబరు, పిన్ నంబర్‌లు తెలియజేయవద్దని సూచించారు.
జల్సాలకు అలవాటు పడి...
ఓ వైపు బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తూనే జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించాలనే ఆలోచనే సతీష్‌కుమార్‌ను బ్యాంకు నేరాలకు పాల్పడేందుకు చేసింది. బ్యాంకు నుంచి కాజేసిన మొత్తాన్ని విలాసాలకు వినియోగించాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
Comments
Please login to add a commentAdd a comment