తిమ్మాజీపేట మండలం ఆవంచకు చెందిన మన్సూరు అవసరానికి డబ్బులు తీసుకునేందుకు ఫిబ్రవరి ఏడో తేదీన జడ్చర్లలోని ఎస్‌బీహెచ్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాడు. అతని వెంట కొందరు కేంద్రంలోకి వెళ్లి మాటల్లో పెట్టారు. అతని వద్దనుంచి ఏటీఎం కార్డు దొంగిలించారు. అనంతరం అతని ఖాతానుంచి 30వేల రూపాయలు కాజేశారు... జిల్లాలోని ఏటీఎం సెంటర్లలో జరుగుతున్న మోసాలకు ఒక ఉదాహారణ మాత్రమే.. ప్రతి రోజూ ఇలాంటి వారు ఎందరో మోసాలకు బలవుతూ.. లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో ఏటీఎం సెంటర్ల నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ఎక్కడా సెక్యూరిటీ గార్డులు ఉండడం లేదు. వాటి నిర్వహణను గాలికొదిలేశారు. ఇదే అదునుగా భావించి మోసకారులు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయకులను బుట్టలో వేసుకొని ఏటీఎం కార్డులను మార్చేసి... వేల రూపాయలు దండుకుంటున్నారు. జిల్లాలో ప్రతినెల నాలుగైదు దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా బ్యాంకులనే లూటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇలా ఆర్థిక నేరాలు రోజురోజుకు శృతిమించుతున్నా బ్యాంకు యాజమాన్యాలు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో బ్యాంకులు పోటాపోటీగా ఆటోమెటిక్ టెల్లర్ మిషిన్ (ఏటీఎం)లను ఏర్పాటు చేస్తున్నాయి. వీటిని ఆర్భాటంగా ప్రారంభిస్తున్నా... రక్షణ చర్యలు మాత్రం విస్మరిస్తున్నారు. నిత్యం లక్షలాది రూపాయలు డ్రా చేసే ఈ కేంద్రాల వద్ద కనీసం సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయలేకపోవడంతో వినియోగదారులు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలో మొత్తం 210 ఏటీఎం కేంద్రాలున్నాయి. వీటి నుంచి ప్రతిరోజూ కోటి నుంచి కోటిన్నర రూపాయల వరకు నగదు డ్రా చేస్తున్నట్లు సమాచారం. అయితే వీటివద్ద భద్రత కల్పించాల్సిన బాధ్యత సంబంధిత బ్యాంకుల పైనే ఉంటుంది. కానీ ఏ ఒక్క కేంద్రం వద్ద సెక్యూరిటీ గార్డులుండటం లేదు. పైగా ఏటీఏం కేంద్రాల లోపల సీసీ కెమెరాలు కూడా పనిచేయడం లేదు. దీని కారణం చాలా వరకు బ్యాంకులు ఆర్థికభారం పడుతుందనే ఉద్దేశంతో నియమించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని బ్యాంకులు ఒకటి, రెండు ముఖ్యమైన పాయింట్ల వద్ద మాత్రమే సెక్యూరిటీ గార్డులను నియమించి చేతులు దులుపుకుంటున్నాయి. ముఖ్యంగా పట్టణ, మండల కేంద్రాల్లో ఉండే ఏటీఎం సెంటర్ల వద్ద భద్రత ఉండడం లేదు. ఏటీఎం సెంటర్లకు ఆటోమెటిక్‌గా మూసుకునే గ్లాస్ డోర్ ఉండాలి. జిల్లాలో ఇలాంటివి ఎక్కడా కనిపించవు. ఎల్లప్పుడూ తలుపులు తెరిచే ఉంటున్నాయి. దీంతో ఆగంతకులు నేరుగా లోనికి ప్రవేశించి డబ్బులు డ్రా చేసే సమయంలో మిస్‌గైడ్ చేయడంతో పాటు వారి ఏటీఎం కార్డులను తస్కరిస్తున్నారు. జిల్లాలో ఇలాంటివి ఎన్ని దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నా వాటి కేసుల్లో పురోగతి ఉండడం లేదు.
మూతపడే దర్శనం...
జిల్లాలోని ఏటీఎం సెంటర్ల భద్రత ఒక ఎత్తయితే... వాటి నిర్వహణ వినియోగదారులకు మరింత చికాకు కల్పిస్తున్నాయి. చాలా వరకు సెంటర్లు ఎప్పుడు చూసినా ‘‘సాంకేతిక కారణాల వల్ల తాత్కాలికంగా పనిచేయడం లేదు’’ అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల కేంద్రాల్లో అవసరం మేరకు నగదు నిల్వ ఉంచడం లేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తున్నాయి.
ఈ పరిస్థితి నెల మొదటి వారంలో మరింత జఠిలంగా మారనుంది. ఏటీఎంలలో డబ్బుల నిల్వకు సంబంధించి బ్యాంకులు ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తాయి. డబ్బుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు సరిపడా నిల్వ ఉండేలా సంబంధిత ఏజెన్సీ నిర్వహించాలి. కానీ ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. బ్యాంకులకు, ఏజెన్సీలకు మధ్య సమన్వయం లేకపోవడంతో ఏటీఎంలలో డబ్బులు లేకుండా రోజుల తరబడి ఉండిపోతున్నాయి.
బ్యాంకులను హెచ్చరిస్తున్నాం: మల్లారెడ్డి,
అడిషనల్ ఎస్పీ, మహబూబ్‌నగర్
ఇటీవల బ్యాంకు దోపిడీలు, ఏటీఎం సెంటర్ల వద్ద అంగతకుల మోసాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా బ్యాంకులను పదే పదే హెచ్చరిస్తున్నాం. అంతేకాదు సీసీ కెమెరాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని, వాటి రికార్డింగ్ ఒక రహస్య ప్రదేశంలో నిల్వ ఉండేట్లుగా చూడాలని సూచించాం. మా సిబ్బంది కూడా బ్యాంకులు, ఏటీఎం సెంటర్ల విషయంలో చాలా అప్రమత్తంగా ఉన్నారు. బ్యాంకుల వద్ద పాయింట్ బుక్‌లు ఏర్పాటు చేశాం.
ఏటీఎం..
Published Fri, Mar 6 2015 1:16 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement