కేన్సర్ వ్యాధితో మంచానికి పరిమితమైన సంజీవ్
సాక్షి, హైదరాబాద్: అతనో సేవకుడు. తాను పేదరికంలో ఉన్నా.. ఆపన్నులకు సేవా హస్తం అందించి సాయపడే గుణం అతనిది. స్వతహాగా ఆటో డ్రైవరైన అతను వృద్ధులకు, దివ్యాంగులకు, గర్భిణులకు తన ఆటోను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చేవాడు. ఇలా ఎంతో మందికి తోడ్పాటును అందించిన ఆపద్బాంధవుడు మ్యాదరి సంజీవ్‌కు ఆపద వచ్చింది. ఆదుకునేవారి కోసం ఎదురు చూస్తున్నాడు. నలుగురికి సేవలందిస్తున్న ఆ పేదవాడి జీవితంలో కేన్సర్ దుఃఖాన్ని మిగిల్చింది. అందినకాడల్లా అప్పులు చేసి మూడెళ్ల క్రితం ఎముకల కేన్సర్‌కు ఆపరేషన్ చేయించుకున్నాడు.
కోలుకుంటున్న తరుణంలో కేన్సర్ మహమ్మారి మళ్లీ సోకింది. అయినా కుటుంబాన్ని పోషించుకునేందుకు ఆటో నడపడం మానుకోలేదు. ఈ క్రమంలోనే శరీరంలోని మిగతా భాగాలకు వ్యాధి సోకినట్లు వైద్యులు ప్రకటించారు. మరోసారి తప్పనిసరిగా ఆపరేషన్ చేయించుకోవాలని సూచించారు. కుటుంబ పోషణ, అప్పుల భాదతో తల్లడిల్లుతున్న సంజీవ్‌కు ఆపరేషన్ చేయించుకోవడం మృగ్యంగా మారింది. దిక్కుతోచని స్ధితిలో అటు ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్ధితి లేక ఇటు కుటుంబాన్ని పోషించుకోలేక సంజీవ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ఆపదలో నేనున్నానంటూ..
వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ఎవరికి ఆపద వచ్చినా తన ఆటోలో వారి గమ్యస్థానాలకు చేర్చేవాడు సంజీవ్. అర్ధరాత్రయినా సరే వెంటనే చేరుకునేవాడు. తన ఆటోపై వృద్ధులు, గర్భిణులు, దివ్యాంగుల కోసం ఉచితంగా ప్రయాణం అని తన ఫోన్ నంబర్ రాసి ఎంతో మందిని ఆపదల్లో ఆదుకున్నాడు. 12 ఏళ్ల క్రితం తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ఆటో లేక తాను ఎదుర్కొన్న అవస్థలు మరొకరికి రావద్దని నిర్ణయించుకున్న సంజీవ్ సేవలందించాడు.
తనయుడే ఆటో నడుపుతూ..
ఎస్పీఆర్‌హిల్స్‌లోని వినాయకనగర్ బస్తీకి చెందిన మ్యాదరి సంజీవ్ తన కుటుంబంతో కిరాయి గృహంలో ఉంటున్నాడు. పదో తరగతి వరకు చదువుకున్న సంజీవ్ కుమారుడు కార్తీక్ తండ్రి దయనీయ పరిస్థితితో రహమత్‌నగర్, ఎస్పీఆర్‌హిల్స్ మార్గంలో ఆటో నడుపుతున్నాడు. వచ్చిన డబ్బులతో తండ్రి వైద్య ఖర్చులు, కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సంజీవ్ కూతురు కల్యాణి ఇంటర్మీడియట్ చదువును మధ్యలో ఆపి కుటుంబ పనుల్లో తల్లికి చేదుడువాదోడుగా ఉంటోంది. దాతలు తనను ఆదుకోవాలని సంజీవ్ కోరుతున్నాడు. ఆర్థికంగా సాయపడేవారు 80080 55788ను సంప్రదించాలని వేడుకుంటున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment