సాక్షి, హైదరాబాద్: ఒకేసారి ఎక్కువ మంది ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించే ఆటోమేటిక్ థర్మల్ స్క్రీనింగ్ పద్ధతిని దక్షిణ మధ్య రైల్వే మొదటిసారి అందుబాటులోకి తెచ్చింది. సికింద్రాబాద్, నాంపల్లి రైల్వేస్టేషన్లలో వీటిని ఏర్పాటు చేశారు. బుల్లెట్ థర్మల్ ఇమేజ్ స్క్రీనింగ్ కెమెరాలుగా పరిగణించే ఈ వ్యవస్థలో అలారం, థర్మల్ స్క్రీనింగ్ కెమెరా, వీడియో రికార్డర్, ఎల్‌ఈడీ మానిటర్ ఉంటాయి. ప్రస్తుతం అత్యవçసర ప్రయాణికుల కోసం వివిధ ప్రాంతాల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. నిర్ధారిత టికెట్ ఉన్న వారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తున్నారు. కానీ ఒక్కో ప్రయాణికుడికి థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష చేసి లోపలికి అనుమతించే క్రమంలో జాప్యం జరుగుతోంది.
దీన్ని నివారించేందుకు ఈ బుల్లెట్ థర్మల్ ఇమేజింగ్ స్క్రీనింగ్ కెమెరాలు దోహదం చేస్తాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారం మూడో ప్రవేశ ద్వారం వద్ద, నాంపల్లి రైల్వేస్టేషన్ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ కెమెరాల ద్వారా ఒకేసారి 30 మంది శరీర ఉష్ణోగ్రతలను పరీక్షించవచ్చు. ప్రవేశ ద్వారాలకు 6 మీటర్ల దూరంలో ఈ కెమెరాలను ఏర్పాటు చేశారు. కెమెరా ముందు ప్రయాణికులు నిలబడగానే అలారం మోగుతుంది. ఆటోమేటిక్‌గా వారి శరీర ఉష్ణోగ్రతలు ఎల్‌ఈడీ మానిటర్‌పై కనిపిస్తాయి. ఈ డేటాను తిరిగి çపరిశీలించేందుకు వీలుగా భద్రపర్చుకోవచ్చు. దక్షిణ మధ్య రైల్వే ఆరోగ్య విభాగం, ఆర్‌పీఎఫ్ పోలీసులు ఈ థర్మల్ స్క్రీనింగ్‌లను పర్యవేక్షిస్తారు. ఒక్కో కెమెరాను రూ.4.4 లక్షల వ్యయంతో కొనుగోలు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment