ఘట్‌కేసర్ (రంగారెడ్డి జిల్లా) : రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలంలోని అవుశాపూర్ గ్రామంలో మిషన్ కాకతీయ పనులను నిలిపి వేయాలని కోరుతూ కొంతమంది రైతులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వారు విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామంలోని రాంచెరువులోని కొంత భాగం.. సర్వే నంబర్లు 173 నుంచి 182,187 వరకు తమ భూములు ఉన్నట్లు చెప్పారు. వాటిలో ప్రతి సంవత్సరం పంటలు సాగు చేస్తున్నట్లు వివరించారు. మిషన్ కాకతీయ పనుల వల్ల తమ పొలంలో మట్టిని తవ్వి గుంతగా మారిస్తే వానాకాలంలో నీరు నిలిచి చెరువుగా మారుతుందన్నారు. దీంతో పంటలు సాగుచేసుకోలేని పరిస్థితులు ఏర్పడతాయని చెప్పారు. ఆ పొలాల ఆధారంగానే జీవితాలను గడుపుతున్నామని, తమ పొలాలను చెరువుగా మార్చితే ప్రత్యామ్నాయం లేక కుటుంబాలు వీధిన పడతాయన్నారు. మిషన్ కాకతీయ పనులను వెంటనే నిలిపివేయాలని ఆయా సర్వే నంబర్ల రైతులు బాలనర్సింహ, లక్ష్మయ్య, కొట్టి సునీల్‌రెడ్డి, రాజేశ్వరి, నరేందర్‌రెడ్డి, ఎం.శ్రీవాణి, ఎం.కృష్ణ హైకోర్టును ఆశ్రయించారు.