సాక్షి, హైదరాబాద్: ఔషధ మొక్కలకు నిలయమైన అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం చింది. వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిలో ఏర్పాటు చేయనున్న ఆ ఆస్పత్రిలో ఆయుర్వేదం, హోమియో, యునానీ, నేచురో పతి వంటి ప్రత్యామ్నాయ వైద్యసేవలను అందించనున్నారు. అనంతగిరిలో 140 ఎకరాల విస్తీర్ణంలో టీబీ ఆస్పత్రి ఉంది. దీనిలోని 28 ఎకరాలను ఆయుష్ ఆస్పత్రి కోసం ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది.
రూ.6 కోట్లతో 50 పడకల ఆస్పత్రిని నిర్మించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఈ నిధులను కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం మరికొన్ని నిధులను కేటాయించనుంది. టీబీ ఆస్పత్రి పరిధిలో ఉన్న కొన్ని భవనాలను ఆయుష్ ఆస్పత్రికి కేటాయించనున్నారు. జీవనశైలిలో వస్తున్న మార్పులతో రక్తపోటు, మధుమేహం, వెన్నునొప్పి, మెడ నొప్పి, కాళ్ల నొప్పుల వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రతికూల ప్రభావాలు లేకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ప్రకృతి వైద్యమే ఉత్తమ మని తాజాగా వైద్యులు సూచిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం ఒక ఆయుష్ ఆస్పత్రి ఉంది. ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య ఎక్కు వగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అనంతగిరిలో వైద్య శాఖ మరో ఆస్పత్రిని ఏర్పాటు చేస్తోంది.
ఔషధ మొక్కల నిలయం...
వికారాబాద్ సమీపంలో అనంతగిరి ప్రాంతం లో అడవులు ఉంటాయి. ఇక్కడి నేల, వాతావరణ పరిస్థితుల్లో ఔషధ మొక్కలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి వాతావరణంలో ఆయు ష్ వైద్య సేవలందిస్తే రోగులకు త్వరగా ఉపశమనం కలుగుతుందనే ఉద్దేశంతో కొత్త ఆస్పత్రిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చే రోగులకు అవసరమైన వసతి ఏర్పాట్లను చేసేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందిస్తోంది. అనంతగిరి ప్రాంతంలోని కొండల్లో భారీ సంఖ్యలో ఔషధ మొక్కలను నాటాలని అటవీ శాఖ ఇప్పటికే నిర్ణయించింది.
త్వరలోనే ప్రారంభం
అనంతగిరిలో ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. అక్కడి టీబీ ఆస్పత్రిలోని భవనాల్లో కొన్నింటిని అప్పగించనున్నారు. వైద్య సేవలకు అవసరమైన ఇతర వసతులను సమకూరుస్తున్నాం. ఇది పూర్తి కాగానే ఆస్పత్రిని ప్రారంభిస్తాం. – ఎ.రాజేందర్‌రెడ్డి, ఆయుష్ డైరెక్టర్