మార్కెట్‌లో మళ్లీ సందడి | B Category Shops Opened in Nizamabad | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లో మళ్లీ సందడి

Published Fri, May 8 2020 12:30 PM | Last Updated on Fri, May 8 2020 12:30 PM

B Category Shops Opened in Nizamabad - Sakshi

నగరంలోని పూసలగల్లీలో తెరుచుకున్న బి కేటగిరి షాపులు

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో సందడి షురువైంది. నెలన్నర రోజులుగా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన ప్రధాన వ్యాపార కూడళ్లలో క్రమంగా రద్దీ ప్రారంభమైంది. నిజామాబాద్‌ నగరంతో పాటు బోధన్, ఆర్మూర్, భీమ్‌గల్‌ పట్టణాల్లోని మార్కెట్లలో జన జీవనం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం ‘ఎ’ కేటగిరి పరిధిలో ఉండే మెడికల్‌ షాపులు, కిరాణ, పాలు, కూరగాయల వంటి షాపుల్లో మాత్రమే లావాదేవీలు జరిగాయి. తాజాగా సడలించిన ఆంక్షలతో ‘బి’ కేటగిరి పరిధిలోని వ్యాపార, వాణిజ్య సంస్థల్లో గురువారం నుంచి షరతులతో కూడిన లావాదేవీలు జరుగుతున్నాయి.  ప్రధానంగా బట్టల షాపులు, సిమెంట్, స్టీలు, ఇతర భవన నిర్మాణ మెటీరియల్‌ షాపులు అక్కడక్కడా తెరుచుకున్నాయి. ఆటోమోబైల్‌ షాపులు కొన్ని తెరుచుకున్నాయి. మాస్కులు ధరించి బయటకు వస్తున్న ప్రజలు భౌతిక దూరం పాటించడంలో మాత్రమే అదే అలసత్వాన్ని ప్రదర్శించారు. ‘సి’ కేటరిగిలోకి వచ్చే సినిమా హాళ్లు, బార్లు, విద్యా సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లను తెరిచేందుకు అనుమతి లేదు.

హేర్‌ కటింగ్‌ సెలూన్‌లు బంద్‌
హేర్‌కటింగ్‌ సెలూన్‌లు తెరిచేందుకు నాయిబ్రాహ్మణులు ఆంగీకరించలేదని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. ఈ సంస్థల్లో సేవలందించాలంటే తప్పనిసరిగా వినియోగదారులను తాకాల్సి ఉంటుంది. దీంతో భౌతిక దూరం పాటించడం ఏ మా త్రం వీలు కాదు. దీంతో మరికొన్ని రోజులు హేర్‌కటింగ్‌ సెలూన్‌లను మూసి ఉంచాలనే నిర్ణయానికి వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

షురువైన రిజిస్ట్రేషన్లు.. ఆర్టీఏ సేవలు..
లాక్‌డౌన్‌లో పూర్తిగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ఆర్టీఏ కార్యాలయాల్లో దైనందిన కార్యకలాపాలు పున:ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఆర్టీఏ సేవలు కూడా ప్రారంభమయ్యాయి. డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహన ఫిట్‌నెస్, ఎల్‌ఎల్‌ఆర్, రిజిస్ట్రేషన్ల వంటి సేవలు కొన్ని  ప్రారంభయ్యాయి. మీసేవా కేంద్రాలు కూడా పని చేస్తున్నాయి. ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కార్యాకలాపాలు పుంజుకున్నాయి.

ప్రైవేటు ఆస్పత్రుల్లో షురూ కాని ఓపీ సేవలు..  
లాక్‌డౌన్‌ సమయంలో కేవలం అత్యవసర వైద్య సేవలందించిన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవలు గురువారం ప్రారంభం కాలేదు. కేవలం గర్భిణు వైద్య సేవలు మాత్రమే అందుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఓపీ సేవల అంశంపై జిల్లా వైద్యారోగ్యశాఖ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇంటి నంబర్‌ చివరి సంఖ్య ప్రకారం..
నిజామాబాద్‌ నగరంలో మున్సిపల్‌ లైసెన్సులు పొందిన వ్యాపార, వాణిజ్య సంస్థలు 8,870 వర కు ఉంటాయి. ఇందులో బీ కేటగిరి పరిధిలోకి వ చ్చే వ్యాపార సంస్థలు సుమారు 4 వేల వరకు ఉంటాయని మున్సిపల్‌ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో రోజుకు 50 శాతం షాపులను మాత్రమే తెరిచేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఆయా సంస్థల ఇంటి నెంబరు చివరి అంకె సరి సంఖ్య ఉంటే సరిసంఖ్య తేదీల్లోనే షాపులు తెరవాలి.  ఇంటి నెంబరు బేసి ఉంటే బేసి సంఖ్య తేదీల్లోనే షాపులు నడపాలి. అలాగే షరతులతో కూడిన లా వాదేవీలు జరగాలని మున్సిపల్‌ అధికారులు ఆ దేశాలు జారీ చేశారు. భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా చేసి, మాస్కులు ఉంటేనే లోపలికి అనుమతి ఇచ్చేలా ఆదేశాలు ఇచ్చారు. అలాగే సానిటైజర్, హ్యాండ్‌ వాష్‌ వంటి సౌకర్యాలు కల్పించాలని షరతులు విధించారు. ఈ మేరకు నగరంలోని బట్టల వర్తక సంఘం, గోల్డ్‌ మర్చంట్స్‌ వంటి అసోసియేషన్లతో మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌ సమావేశాలు నిర్వహించి లాక్‌డౌన్‌ ఆదేశాల మేరకు నడుచుకోవాలని అవగాహన కల్పించారు. ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్‌ మున్సిపాలిటీల్లో వ్యాణిజ్య సంస్థల సంఖ్య కాస్త తక్కువగా ఉండటంతో అక్కడ ఆయా సంస్థలకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేకంగా నెంబర్లు కేటాయించి.. సరి, బేసి విధానంలో రోజు విడిచి రోజు షాపులు తెరిచేలా ఏర్పాట్లు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement