పాడె మోసేవారు లేరు.. డప్పు కొట్టేవారు లేరు.. వైకుంఠ రథంలో మృతదేహాన్ని తీసుకెళుతున్న దృశ్యం (ఫైల్)
సాక్షి, కామారెడ్డి: ఒక్కడై రావడం.. ఒక్కడై పోవడం విధిలీల.. తుదివేళ ఏ బంధమూ వెంట రాదు. బంధువులు, బలగం ఎంతమందున్నా.. వెంట నడిచేది కాటివరకే.. కానీ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ‘కరోనా’ నీడలో చావు కూడా భారంగా మారింది. పార్థివదేహాన్ని శ్మశానానికి మోసుకెళ్లేందుకు ఆ నలుగురు కూడా రాని పరిస్థితి దాపురించింది. రక్తసంబంధీకులు, ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు, బంధువులు ఎవరూ అంత్యక్రియలకు వెళ్లలేకపోతున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఆంక్షలు అమలు అవుతున్నాయి. గుంపులుగా ఒకేచోటుకు చేరితే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. దీంతో అంత్యక్రియలపైనా ఆంక్షలున్నాయి. కరోనా వైరస్ గురించి అవగాహన పెరగడంతో ప్రజలు సైతం చావులకు వెళ్లడం లేదు.
బంధువో, స్నేహితుడో చనిపోయాడని తెలిస్తే పరుగున వెళ్లేవారంతా ఇప్పుడు వెనకాముందవుతున్నారు. కొందరు ఏదైతే అది జరగని అంటూ చివరి చూపు చూడాలనే ఆరాటం ఉన్నా వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. లాక్‌డౌన్ మూలంగా రవాణా పూర్తిగా స్థంభించిపోయింది. రోడ్లపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్లపై వాహనాలు తిరిగితే చాలు పోలీసులు పట్టుకుని సీజ్ చేస్తున్నారు. ఒక్క వైద్యం కోసం తప్ప మరే దానికీ పోలీసులు అనుమతించడం లేదు. దీంతో చావులకు కూడా వెళ్లలేకపోతున్నారు. రక్త సంబంధీకుడు చనిపోయినా సరే వెళ్లేందుకు పరిస్థితులు అనుకూలించడం లేదు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కనీసం పరామర్శలకు వెళ్లడానికీ సాహసించడం లేదు. చివరి చూపు చూడాలన్న ఆవేదనను దిగమింగుకుని ఇంటి దగ్గరే నాలుగు కన్నీటిబొట్లు రాలుస్తున్నారు.
పాడె మోసే వారు లేరు..
ఎవరైనా చనిపోయినపుడు డప్పు చప్పుళ్ల మధ్య పాడెను సిద్ధం చేస్తారు. నలుగురు ఆ పాడెను మోస్తారు. రక్త సంబంధీకులు, స్నేహితులు, బంధువులు కూడా తలా ఓ చేయి వేస్తారు. దారిపొడవునా పాడె చేతులు మారుతూ ఉంటుంది. తొలుత పాడె ఎత్తిన చేతులు తిరిగి దించే సమయంలోనూ ఉండాలి. అయితే ఇప్పుడు పాడె మోసేవారు లేకుండాపోయారు. ఎవరు చనిపోయినా దగ్గరి వాళ్లు కూడా రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. చాలా మంది వైకుంఠ రథాలలోనే తీసుకెళ్తున్నారు. కుటుంబ సభ్యులే పాడెను లేపి రథంలో ఉంచుతున్నారు. రథం వెనుకా, ముందూ ఎవరూ కనిపించడం లేదు.
డప్పు కొట్టే వారూ రావట్లేదు!
చావు డప్పు కొట్టడానికి చాలా ప్రాంతాల్లో ఎవరూ ముందుకు రావడం లేదు. అలాగే ఖననం చేసేందుకు గుంత తీయడం, కాడి పేర్చడానికి కూడా మనుషులు దొరకడం లేదు. ఎందుకంటే చావుకు వెళితే కరోనా ఎక్కడ తమను అంటుకుంటుందోనన్న భయం వారిని వృత్తికి దూరం చేస్తోంది. కొన్ని గ్రామాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో చావు డప్పుకు వెళ్తున్నా, చాలా చోట్ల నిరాకరిస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లోనైతే పాడె కట్టెవారు కూడా రావడం లేదని తెలుస్తోంది.‘స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్’ అని ఆకలిరాజ్యం సినిమాలో సినీ గేయ రచయిత రాసినట్లుగా శుభకార్యాల్లోలాగానే అంతిమ యాత్రల్లోనూ ఆ ర్భాటాలు చేయడం సాధారణమైపోయింది. అయితే కరోనాతో పరిస్థితి మారిపోయింది. బలగం, బంధువులు ఉన్నా.. లాక్‌డౌన్ ఆంక్షల కారణంగా అంత్యక్రియలకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అంతిమ యాత్రలో పాడె మోసేందుకు ఆ నలుగురూ కరువవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment