
హార్దిక్ (ఫైల్)
కుల్కచర్ల: ఇంట్లో బజ్జీలు వేసుకున్న తర్వాత సలసల కాగే నూనె పడడంతో ఓ చిన్నారి మృతిచెందిన సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం ముజాహిద్‌పూర్‌లో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిట్యాల నర్సింలుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన గ్రామంలో చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఆయన ఇంటికే పరిమితమయ్యాడు. ఈక్రమంలో మంగళవారం సాయంత్రం ఇంట్లో దంపతులు బజ్జీలు వేసుకున్నారు. అవి పూర్తయిన తరువాత స్టౌవ్ బంద్ చేసి నూనెను కిందికి దింపకుండా అలాగే ఉంచారు.
అనంతరం వారు పని మీద బయటకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు హార్దిక్ (4) బజ్జీల కోసం నూనె వద్దకు వెళ్లాడు. కడాయిని పట్టుకునేందుకు యత్నించగా బాలుడి మీద పడింది. బాగా వేడిగా ఉన్న నూనె పడడంతో బాలుడు విలవిల్లాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మంగళవారం రాత్రి బాలుడు మృతిచెందాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలుబాదుకుంటూ రోదించారు.
Comments
Please login to add a commentAdd a comment