ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ | backwardness of muslims are education, employment sectors | Sakshi
Sakshi News home page

ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ

Published Thu, Mar 27 2014 11:22 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM

backwardness of muslims are education, employment sectors

సాక్షి, సంగారెడ్డి: ‘ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ’!.. ముస్లింల స్థితిగతులు తెలిపే ఈ ఉర్దూ సామెత దశాబ్దాలుగా విస్తృత ప్రచారంలో ఉంది. ఈ సామెత ఎప్పుడు పుట్టిందో ఏమో కానీ.. ముస్లింలు అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం పురోగమించలేకపోయారు. విద్యా, ఉపాధికి, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముస్లింలు ఎస్సీల కంటే వెనకబడిపోయారని కేంద్ర ప్రభుత్వం నియమించిన పలు కమిటీలు కుండబద్దలు కొట్టాయి. అయినా.. ప్రభుత్వాలు, పార్టీలు ముస్లింలను ‘ఓటు బ్యాంకు’గానే చూశాయి తప్ప అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేయలేకపోయాయి. ముస్లింల సంక్షేమం కోసం యూపీఏ సర్కార్ ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి 20 సూత్రాల కార్యాక్రమం ఘోరంగా విఫలమైంది. ఈ కార్యక్రమం ఎక్కడా అమలైన దాఖలాల్లేవు.

 వైఎస్ నిర్ణయం భేష్..
 విద్యా, ఉద్యోగ రంగాల్లో ముస్లింలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లు కల్పించడం.. ఎందరో ము స్లింలకు చేయూత కల్పించింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా దృఢసంకల్పంతో వైఎస్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయం..నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న వేల మంది ముస్లిం యువతీయువకుల జీవితాల్లో వెలుగులు నిం పింది. ఏపీపీపీఎస్సీ, డీఎస్సీలతో పాటు ఆయా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ఉద్యోగ నియామకాల్లో ముస్లింలకు 4 శాతం వాటా లభిస్తోంది. గడిచిన ఐదారేళ్లలో వందల సంఖ్యలో జిల్లావాసులు ఉద్యోగాలు పొంది జీవితంలో స్థిరపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కేటగిరీగా రిజర్వు చేసిన స్థానాల్లో సైతం పోటీ చేసే అవకాశం లభించింది.

 ఉర్దూ వర్థిల్లు..
 ఒకప్పుడు రాజభాషగా వెలుగొందిన ఉర్దూ నేడు పూర్వ వైభవాన్ని కోల్పోయింది. తెలంగాణ జిల్లాల్లో రెండో అధికారిక భాషగా గుర్తింపు కలిగినప్పటికీ .. ఉర్దూ భాషకు పట్టిన దుర్గతి తొలగిపోలేదు. ఉర్దూ మాధ్యమంలో విద్యను అభ్యసిస్తే సర్కారీ కొలువులు రావనే భావన వల్ల ముస్లింలు దశాబ్దాలుగా మాతృభాషకు దూరమయ్యారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు లేక వందల సంఖ్యలో సర్కారీ ఉర్దూ బడులు మూతబడ్డాయి. ప్రస్తుతం జిల్లాలో 151 ప్రాథమిక ఉర్దూ పాఠశాలలుంటే..అందులోని 33 బడుల్లో ఏడాదికాలంగా ఒక్క ఉపాధ్యాయుడూ లేడు. వచ్చే విద్యాసంవత్సరం నాటికి ఇవీ మూతబడే ప్రమాదముంది.

 వక్ఫ్ ..బురా వక్త్
 వక్ఫ్ అంటే దేవుడి ఆస్తి. తెలంగాణలో అత్యధిక వక్ఫ్ ఆస్తులున్న జిల్లాల్లో మెదక్ జిల్లా ఒకటి. 25 వేల ఎకరాలకుపైగా వక్ఫ్ భూములు జిల్లాలో ఉంటే.. ఇప్పటికే 15 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. 60 శాతం ఆస్తులు పరాధీనమైనా పాలకులు చూస్తుండిపోయారు. వక్ఫ్, రెవెన్యూ అధికారుల అవినీతి కారణంగా కబ్జాదారులు వక్ఫ్ భూములకు పట్టాలు, ఆక్యూపేషన్ రైట్స్ సర్టిఫికెట్‌లు సంపాదించి రిజిస్ట్రేషన్‌లు చేయించుకున్నారు. పరాధీనమైన భూములను పరిరక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పన్నుల రూపంలో వక్ఫ్ బోర్డుకు ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చాల్సి ఉండగా..కేవలం రూ.లక్షన్నర మాత్రమే వసూలవుతోంది.

 అధికారానికి దూరంగా..
 జహీరాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండగా.. మిగిలిన అన్ని నియోజకవార్గల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. ఎక్కడ నుంచి గెలవాలన్నా ముస్లింల ఓట్లు కీలకమే. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో జహీరాబాద్ ఎస్సీ సెగ్మెంట్‌గా రిజర్వు కావడంతో అక్కడ పోటీ చేసే అవకాశాన్ని ముస్లింలు కోల్పోయారు. జహీరాబాద్ నుంచి 1999, 2004 ఎన్నికల్లో వరుసగా గెలిచి వైఎస్ క్యాబినెట్‌లో మంత్రి పదవి చేపట్టిన ఫరీదుద్దీన్ జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు. ఆ తర్వాత ఆయన ప్రభ కోల్పోయారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ముస్లింలకు కేటాయించాలనే డిమాండు అన్నీ పార్టీలూ ఎదుర్కొంటున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement