
సాక్షి, హైదరాబాద్: ఓపెన్‌ప్లాట్లకు ఇంటి నెంబర్లు తీసుకుని వందకు పైగా ఓటర్ల నమోదు.. ఒకే ఇంట్లో 38 మంది ఓటర్లు, మరో ఇంట్లో 32 ఓట్లు.. ఇలా ఒక్క మున్సిపల్ డివిజన్‌లోనే 380 నుంచి 400 వరకు నకిలీ ఓట్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఇదంతా కూడా బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్‌లో ఓటర్ల జాబితాలు, ఓటర్ల నమోదులో చోటుచేసుకున్న కొన్ని అవకతవకలు. ఈ అంశం ఎంతవరకు వెళ్లిందంటే ఒక ఇంటి యజమాని తన చిరునామాతో 32 బోగస్ ఓట్లు ఉన్నాయంటూ సంబంధిత తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేంత. వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితాలను పరిశీలించి, ఆయా ఇంటినెంబర్ల వారీగా ఎవరెవరున్నారన్న విషయాన్ని సరిచూసుకున్న సందర్భంగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
ఈ కార్పొరేషన్‌లోని 18వ డివిజన్ సాయినగర్‌లోని 8–22 ఇంటినెంబర్‌లో 38 ఓట్లు, అదేకాలనీలోని 8–21 ఇంటినెంబర్‌లో 32 ఓట్లు, 8–91 ఇంటినెంబర్‌తో 30 ఓట్లు ఉన్నట్టుగా తేలింది. అంతేకాకుండా ఇదే డివిజన్‌లోని బాలాజీనగర్‌లో ఓపెన్‌ప్లాట్‌కు 7–58 ఇంటినంబర్‌ను తీసుకుని అందులో ఇళ్లు లేకపోయినా వందకు పైగా ఓట్లు నమోదైనట్టు, అదేవిధంగా అయోధ్యనగర్‌లోని మరో ఓపెన్‌ప్లాట్‌కు కూడా ఇంటి నంబర్ తీసుకుని వంద దాకా ఓట్లు నమోదు చేశారని శ్రీసాయినగర్ కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఎస్. అల్వాల్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ అంశంపై ఇదివరకే ఎమ్మార్వోకు, ఆర్డీవో కు విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డికి అల్వాల్‌రెడ్డి, హరిగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గోవింద్‌రెడ్డి, దీప్‌కాంత్ వినతిపత్రం సమర్పించారు. తమ విజ్ఞప్తిపై కమిషనర్ నాగిరెడ్డి సానుకూలంగా స్పందించారని అల్వాల్‌రెడ్డి తెలిపారు.
►‘ఓటర్ల జాబితాల్లో నకిలీ ఓటర్లున్నారంటూ అందిన వినతిపత్రంలోని విషయాలను సంబంధిత అధికారులకు తెలియజేస్తాం. జాబితాలను పరిశీలించి అక్రమ పద్ధతుల్లో ఓటర్లుగా చేరి ఉంటే వారి నివేదికల అనుగుణంగా తగిన చర్యలు తీసుకుంటాం.’
– వి.నాగిరెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషనర్