బంతి సాగు భలే బాగు | ball flowers cultivate very well | Sakshi
Sakshi News home page

బంతి సాగు భలే బాగు

Published Tue, Aug 26 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 12:26 PM

ball flowers cultivate very well

ఖమ్మం వ్యవసాయం: బంతిపూలకు మార్కెట్‌లో మాంచి గిరాకీ ఉంది. రైతులు బంతి సాగును ఎంచుకుంటే లాభాలు గడించే అవకాశం ఉంది. ప్రస్తుతం కిలో బంతిపూలు రూ.80కి పైగానే పలుకుతున్నాయి. జిల్లాలో రఘునాథపాలెం, కూసుమంచి, ఖమ్మం అర్బన్, రూరల్, కొణిజర్ల, ఎర్రుపాలెం, బోనకల్లు, తల్లాడ, కొత్తగూడెం, జూలూరుపాడు మండలాల్లో బంతి ఎక్కువగా సాగు చేస్తున్నారు.

  వాతావరణం: బంతి పెరుగుదల, పూలదిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితులను బట్టి జూలై మొదటి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకు నాటుకోవచ్చు.

  నేలలు: నీరు త్వరగా ఇంకిపోయే స్వభావం ఉన్నవి, సారవంతమైన గరప నేలలు బంతికి అనుకూలం.

  రకాలు: ఆఫ్రికన్ బంతి: ఇది ఎత్తుగా పెరిగే దృఢమైన మొక్క. దీనిలో ఒంటి రెక్క నుంచి ముద్దగా, పెద్దగా ఉండే రకాలు ఉన్నాయి. పూలు నిమ్మరంగు నుంచి పసుపు, బంగారు వర్ణం నుంచి నారింజరంగు వరకు అనేక వర్ణాలు ఉన్నాయి.

  ఫ్రెంచ్ మేరీగోల్డ్: ఇది పొట్టిగా గుబురుగా పెరిగి ఒంటిరెక్క లేదా ముద్దగా ఉండే పూలు పూస్తాయి. పూలు పసుపు నుంచి నారింజ, ఎరుపు, గోధుమ, బంగారు పసుపు రంగులు మిళితమై ఉంటాయి. ఇవే కాకుండా మేలైన రకాలు పూసా, నారింగ గైండా, పూసా బసంతి గైండా, యూడీయూ-1 రకాలు ఉన్నాయి.
 
విత్తన మోతాదు..విత్తే పద్ధతి: ఎకరానికి 800-1000 గ్రాముల విత్తనాన్ని ఎత్తై మడులు చేసి నాటాలి. మళ్లు తయారు చేసే సమయంలో ఒక చదరపు మీటరుకు 8-10 కిలోలు బాగా చిలికిన పశువుల ఎరువు వేయాలి. విత్తడానికి మొదలు ఫాలిడాల్ పొడి చల్లితే చీమలు, చెదల నుంచి రక్షించుకోవచ్చు. సాధారణంగా 5-7 రోజుల్లో విత్తనాలు మొలకెత్తుతాయి.
 
కత్తిరింపులు: కొన్ని రకాల్లో విత్తనం ఏర్పడదు. ఈ రకాలను కాండపు మొక్కలను నాటి ప్రవర్థనం చేయాలి. దీ ని కోసం కొమ్మల చివర  10 సెం.మీ. పొడవుగల భాగాన్ని కత్తిరించి, చివరి ఒకటి లేక రెండు జతల ఆకులు ఉంచి తేమగల ఇసుకలో (కుండి లేక మడుల్లో) నాటాలి.  మడిలో నాటితే నీడ ఏర్పాటు చేయాలి. ఇసుకలో చెమ్మ ఆరిపోకుండా నీరు చిలకరించాలి. నాటిన 8-10 రోజుల్లో వేరు తొడగడం గమనించవచ్చు. వేరు వ్యవస్థ బాగా ఏర్పడిన తర్వాత వీటిని నాటుకోవాలి.
 
నాటే విధానం: నెల వయసు 3-4 ఆకులున్న మొక్కలు నాటడానికి అనుకూలం. ఆఫ్రికన్ బంతి మొక్కల్ని 40-30 సెం.మీ.దూరంలో కత్తిరింపులను 20ఁ20 సెం.మీ.దూరంలో నాటితే పూల దిగుబడి బాగా ఉంటుంది.
 
ఎరువులు: చివరి దుక్కిలో ఎకరానికి 20 టన్నుల చొప్పున బాగా చిలికిన పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. 20-40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి. నాటిన 37 రోజులకు 20-40 కిలోల నత్రజని పై పాటుగా వేసి నీరు పెట్టాలి.
 
నీటి యాజమాన్యం: నాటిన 55-60 రోజుల వరకు పూత దశలోనూ నేలలో తేమ ఉండేలా చూడాలి.
 
 పించింగ్: ఎత్తుగా పెరిగే ఆఫ్రికన్ బంతి రకాల్లో పెరుగుదల ఎక్కువగా ఉండి చివరగా పూమొగ్గ ఏర్పడుతుంది. అప్పుడే పక్క కొమ్మలు ఏర్పడతాయి.  నాటిన 40వ రోజు పించింగ్ చేస్తే పూల దిగుబడి పెరుగుతుంది.
  పూల కోత: పూలను ఉదయం కాని సాయంత్రం కాని కోయాలి. కోతకు ముందు నీటి తడి ఇస్తే పూలు కోత తర్వాత ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సాధారణంగా ఎకరానికి 4-5 టన్నుల వరకు పూలదిగుబడి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement