నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఐ అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా ట్రాలీ ఆటోలో రూ.48 కోట్లు తరలించేందుకు సిద్ధపడిన ఘటనలో ముగ్గురు బ్యాంక్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడినట్లు తెలిసింది. వీరిలో బ్యాంక్ మేనేజర్‌తోపాటు ఇద్దరు కస్టోడియన్ అధికారులు ఉన్నట్లు సమాచారం.
గురువారం జిల్లాకేంద్రంలోని ఎస్‌బీఐ నుంచి ట్రాలీ ఆటోలో రూ.48 కోట్లను ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా సమీపంలోని గ్రామీణ వికాస్‌బ్యాంక్‌కు తరలించేందుకు సిద్ధం చేస్తుండగా పోలీసులు అడ్డుచెప్పిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పత్రికల్లో వార్తలు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు బ్యాంక్ వర్గాల సమాచారం. దీనిపై నల్లగొండ టూటౌన్ సీఐ బాషా..ఎస్‌బీఐ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. నగదు తరలింపు సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు.
ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలించేటప్పుడు కనీసం పది మంది సాయుధ పోలీసుల రక్షణ అవసరమని పోలీసులు తెలిపారు. కాగా, నగదు తరలింపులో బ్యాంకు అధికారులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని జిల్లా పోలీసులు ఆర్‌బీఐకి నివేదిక పంపుతున్నట్లు తెలిసింది. ఈ సంఘటనకు సంబంధించి గ్రామీణ వికాస్ బ్యాంకుకు చెందిన మరో ఇద్దరు అధికారులపై కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment