
బుధవారం నగరంలో జాగృతి బతుకమ్మ యాప్‌ను ఆవిష్కరిస్తున్న ఎంపీ కవిత
♦ జాగృతి అధ్యక్షురాలు కవిత
♦ ఈసారి 1,100చోట్ల సంబురం
♦ బతుకమ్మ పాటల యాప్ విడుదల
♦ వచ్చే నెల 6వ తేదీన 30 వేల మందితో బతుకమ్మ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ జాగృతి తరపున ఈ ఏడాది 9 దేశాల్లో 11 వందల ప్రాంతాల్లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనున్నామని సంస్థ అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. జాగృతి తరపున బతుకమ్మ పాటలతో కూడిన మొబైల్ యాప్‌ను ఆమె తెలంగాణ భవన్‌లో బుధవారం విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీ నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయన్నారు.
అక్టోబరు 6న హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో 30 వేల మందితో గిన్నిస్ రికార్డు సాధించేలా ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించనుందని చెప్పారు. జాగృతి బతుకమ్మ యాప్‌లో పాటలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, పాటలతో పాటు జాగృతి కార్యకలాపాల సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చని అన్నారు. గత ంలో ప్రతీ నియోజకవర్గంలో అయిదు చోట్ల మాత్రమే నిర్వహించామని, ఈసారి పది చోట్ల జరపనున్నామని చెప్పా రు. వర్షాలను శుభసూచకంగా భావించి బతుకమ్మను ఘనంగా జరుపుకోవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు అందరూ వేడుకల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలన్నారు.
ఏపీకి ఇచ్చినంతే తెలంగాణకు ఇవ్వాలి
తెలంగాణ విమోచన అన్నప్పుడు మాత్రమే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు తెలంగాణ గుర్తుకు వస్తుందని, వరదలంటే మాత్రం ఏపీ గుర్తుకు వస్తుందని కవిత అన్నారు. వరద సాయంగా ఏపీకి ఎంతిస్తే, తెలంగాణకు అంతే ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దె బ్బకొట్టేందుకు ఒక వర్గం మీడియా కుట్ర చేసిందని, హైదరాబాద్ సాంతం మునిగిపోయినట్లు దుష్ర్పచారం చేసిందని అన్నారు. వర్షాల వల్ల నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరదలప్పుడు రాజకీయాలకతీతంగా పనిచేయాల్సిన ప్రతిపక్షాలు వాటినీ రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్ అవినీతి గురించి తాము బయట పెట్టదలుచుకుంటే ఇప్పటి వరదల కంటే వారి అవినీతి వరదే ఎక్కువన్నారు. మిడ్‌మానేరుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 1992లో మిడ్‌మానేరు నిర్మించాలని ప్రతిపాదిస్తే 2006లో తొలిసారి టెండర్లు పిలిచారని గుర్తుచేసిన ఆమె, 2006 నుంచి రెండేళ్ల కిందటి దాకా ఎవరు అధికారంలో ఉన్నారని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్లలో జరగని పనులు ఈ రెండేళ్లలోనే జరుగుతాయా అని నిలదీశారు. వర్షాలు పడినప్పుడు నష్టం జరుగుతుందని, ఈ సమయంలో ప్రజలకు సాయం చేయకుండా రాజకీయం చేయడం తగదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.