సాక్షి, జనగామ: కలెక్టర్ శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల నడుమ విభేదాలకు కారణమైన బతుకమ్మకుంట వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు బతకుమ్మకుంటలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హద్దులు వేసే పనిలో నిమగ్నమయ్యారు. దీంతో వారు ప్రభుత్వానికి మళ్లీ ఎలాంటి నివేదికను అందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జిల్లా కేంద్రంలోని సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట అలియాస్ బతుకమ్మకుంట సర్వేనంబర్ 85లో 9.10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకంలో భాగంగా నియోజకవర్గానికి ఒక మినీట్యాంకు బండ్‌ను మంజూరు చేయగా, బతుకమ్మ కుంటను ఎంపిక చేసి అభివృద్ధి పనులు చేపట్టారు. 2015లో రూ. 1.4 కోట్ల నిధులతో బండ్ అభివృద్ధి పనులు చేశారు. ఈ తరుణంలో బతకుమ్మకుంటను ఆనుకుని ఉన్న కనుకదుర్గమ్మ ఆలయాన్ని విస్తరించారు. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగిన సద్దుల బతుకమ్మ వేడుకల ఏర్పాట్ల సమయంలో కలెక్టర్ అల్లమరాజు శ్రీదేవసేన, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మధ్య వివాదం తలెత్తింది. నిబంధనలకు విరుద్ధంగా బతుకమ్మకుంటను నిర్మించారని, కుంట భూమిని ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్ ఆయనపై బహిరంగ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
బతుకమ్మకుంటలో మరో సారి సర్వే చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇరిగేషన్ రిటైర్డ్ ఈఈ గోపాల్, ఇరిగేషన్ డీఈ పొన్నాల కొమురయ్య, ఇరిగేషన్ ఈఈ శంకర్‌రావు, రెవెన్యూశాఖ నుంచి ఆర్‌ఐ రాజు, సర్వేయర్ ప్రకాశ్ నేతృత్వంలో అధికారుల బృందం శుక్రవారం కుంట హద్దులను పరిశీలించారు. కుంట వద్దనే ఉండి 4 వెపులా కొలతలు వేశారు. అసరమైతే మరోసారి కొలతలను వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉన్నతాధికారుల సూచన మేరకే మరోసారి కుంటలో హద్దుల కొలతలను చేపట్టామని.. అంతకుమించి తమను ఏమి అడగవద్దని అధికారులు చెబుతున్నారు. బతుకమ్మకుంట వద్ద సర్వే చేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment