గొర్రెల మేత కోసం వెళ్లిన కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది.
అమ్రాబాద్ (మహబూబ్‌నగర్ జిల్లా) : గొర్రెల మేత కోసం వెళ్లిన కాపరిపై ఎలుగుబంటి దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాద్ మండలం ఉప్పునూతలబికే గ్రామంలోని అటవీ ప్రాంతంలో శనివారం జరిగింది. మండలంలోని కుమ్మరోనిపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య గత నెల రోజులుగా తన గొర్రెల మందను ఉప్పునూతలబికే గ్రామం సమీపంలోని అటవీప్రాంతానికి మేతకు తీసుకెళ్తున్నాడు.
కాగా ఈ క్రమంలోనే శనివారం గొర్రెల మేతకు వెళ్లిన అతనిపై ఎలుగుబండి దాడి చేసింది. ఈ విషయాన్ని గమనించిన మరికొంతమంది గొర్రెల కాపరులు ఎలుగుబంటిని తరిమికొట్టారు. తీవ్రంగా గాయపడిన వెంకటయ్యను అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. ఇదే మండలంలో శుక్రవారం మరో రైతు ఎలుగుబంటి దాడిలో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో మండలంలోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.