రూ.1,765 కోట్లలతో బీటీ రోడ్ల పునరుద్ధరణ
- పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్
సాక్షి, హైద రాబాద్: రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని రోడ్లతో అనుసంధానం చేయడమే లక్ష్యంగా బీటీ(తారు) రోడ్ల పున రుద్ధరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. తొలిదశలో రూ.1.765 కోట్లతో 12,006 కిలోమీటర్ల బీటీరోడ్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నామన్నారు. బుధవారం పంచాయతీరాజ్ ఇంజనీర్ ఇన్‌చీఫ్, ఇతర ఉన్నతాధికారులతో బీటీ రోడ్ల పునరుద్ధరణ పనులపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు.
కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, అయితే నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే జరిమానా విధించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గడువు పెంచే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్‌వై) ప్రమాణాల మేరకు రహదారులను నిర్మించడంతో పాటు, ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్లదేనని కేటీఆర్ చెప్పారు.
పునరుద్ధరణ పనులకు సంబంధించి నాణ్యత విషయంలో కఠినంగా వ్యవహరించాలని, నాణ్యత లోపిస్తే అధికారులపైనా కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. సబ్ కాంట్రాక్ట్‌ల విధానానికి స్వస్తి పలికేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 4,160 కిలోమీటర్ల మట్టిరోడ్లను బీటీస్థాయిలో అభివృద్ధి చేసేందుకు రూ.2,035 కోట్లు, సుమారు 20 వేల కిలోమీటర్ల మట్టి రోడ్ల పటిష్టానికి కూడా రూ.600 కోట్లు కేటాయించామన్నారు.