
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. పట్టణాల్లో నివాసముంటున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు పండగకు బంధువుల ఇళ్లకో.. విహార యాత్రలకో.. సొంత గ్రామాలకో వెళ్తుంటారు. ఇళ్లకు తాళాలువేసి రెండ్రోజులైతే చాలు అలాంటి ఇళ్లను టార్గెట్ చేసే దొంగలు పెట్రేగిపోయే అవకాశం ఉంటుంది. చుట్టాల్లా వచ్చి దర్జాగా దోచుకెళ్తుంటారు. మరికొందరు ఎవరికి వినపడకుండా అనుమానం రాకుండా తాళాలు పగులగొట్టి అందినకాడికి ఎత్తుకెళ్తుంటారు.
అప్రమత్తత అవసరం..
దొంగతనాలే వృత్తిగా ఎంచుకున్న కొందరు సెలవుల రోజు ల్లోనే విజృంభిస్తుంటారు. గతంలో దసరా సెలవుల్లో పట్టణంలో పలు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. ముఖ్యంగా భగిరథకాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, శ్రీనివాసకాలనీ, ఏనుగొండ, వన్‌టౌన్ ఏరియాలో చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. వరుసగా నాలుగు ఐదు ఇళ్లలో జరిగిన సందర్భాలున్నాయి. పాత దొంగలు చోరీలకు పాల్పడకుండా పోలీసులు ముంద స్తు చర్యలు తీసుకుంటున్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దొంగలు చోరీలు చేసి వెళ్లిపోయే ఆస్కారం ఉంటుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండటంతోపాటు ఊరికి వెళ్లిన సమయంలో పోలీసులు ఇచ్చిన సలహాలు, సూచనాలను పాటిస్తే మన సొమ్ములు భద్రంగా ఉంటాయి.
గతంలో జరిగిన చోరీలు..
గతేడాది దసరా సెలవుల్లో జిల్లా కేంద్రంలోని లక్ష్మినగర్‌కాలనీలో వందన అపార్టుమెంట్‌లో శివయ్య గౌడు, మాధురి దంపతుల నివాసంలో 23 తులాల బంగా రం, రూ.1.40నగదు మాయం చేశారు. అదేవిధంగా వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న వేణుగోపాల్ నివాసంలో 8 తులాల బంగారం, రూ.50వేల నగదు చోరికి గురైంది. అదేవిధంగా ఏనుగొండలో భీంరెడ్డి, సుజాత ఇంట్లో 8 తులాల బంగారం, రూ.50వేల నగదు ఎత్తుకెళ్లారు. దాంతో పాటు శ్రీనివాసకాలనీకి చెందిన భరత్ అనే వ్యక్తి ఇంట్లో 5తులాల బంగారం, రూ.80వేల నగదు చోరీకి గురైంది.
సమాచారమిస్తే గస్తీ పెంచుతాం
సెలవుల్లో వెళ్తున్న వారు సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందిస్తే ఆ ప్రాంతంలో తమ సిబ్బందిచే గస్తీ పెంచుతాం. ప్రజలను అప్రమత్తం చేయడానికి కరపత్రాలను, పోస్టర్లను ఆవిష్కరించి పట్టణాల్లో అంటిస్తున్నాం. – భాస్కర్, డీఎస్పీ మహబూబ్‌నగర్