
ఆస్పత్రి ఎదుట ఆందోళన
మిర్యాలగూడ క్రైం :చిన్నారి మృతికి కారకుడైన వైద్యుడిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మృతురాలి కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సంఘటన బుధవారం మిర్యాలగూడలోని డాక్టర్స్ కాలనీ లోగల శ్రీసాయి జనరల్ ఆస్పత్రి వద్ద జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. దామరచర్ల మండలం మోదుగుల కుంటతండాకు చెందిన రమావత్ రవి, భారతిల కుమార్తె హిందు(4)కు జ్వరం రావడంతో పట్టణంలోని శ్రీసాయి జనరల్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిశీలించిన డాక్టర్ మూడు రకాల ఇంజక్షన్లు రాశాడని, వీటిని ఆస్పత్రి కాం పౌండర్ చిన్నారికి వేసిన కొద్ది క్షణాల్లో మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజక్షన్లు వికటించడం వల్లే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. కాగా విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ సుదర్శన్‌రెడ్డి ఆస్పత్రి వద్దకు వచ్చి వారికి నచ్చచెప్పారు. వైద్యుడి నిర్లక్ష్యం ఉంటే ఫిర్యాదు చేయాలని, పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు.
మా తప్పేమీలేదు..
చిన్నారి ఇందు మృతి విషయమై డాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. తన వద్దకు తీసుకువచ్చినప్పుడు జ్వరం, ఆయాసం, దగ్గుతో బాధపడుతుందన్నారు. తమ ఆస్పత్రి లో కేవలం ట్రీట్‌మెంటుకు ముందు ఏంటాసిడ్, యాంటిఎమిటిక్ ఇంజక్షన్లు మాత్రమే ఇచ్చామని, వీటి వలన రోగికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. పాప పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేషన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించగా వారు తీసుకెళ్లారని, ఈ క్రమంలోనే పాప మృతి చెందిందని వివరించారు.