బెల్లంపల్లిలో ప్రబలిన డయేరియా
► ఆస్పత్రిలో చేరిన రోగులు
► కలుషిత నీటితోనే ప్రమాదం
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన బెల్లంపల్లిలో డయేరియా ప్రబలింది. రెండు రోజుల నుంచి వాంతులు, నీళ్ల విరేచనాలతో ప్రజలు తీవ్ర అస్వస్తతకు గురై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధితుల కథనం ప్రకారం... బెల్లంపల్లిలోని పలు కాలనీలకు సింగరేణి ఫిల్టర్‌బెడ్ నుంచి తాగునీటి సరఫరా జరుగుతోంది. అంతర్గత పైపులైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మురికినీటి కాలువలను ఆనుకొని తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయడంతో కొన్ని చోట్ల లీకేజీ జరిగి నీరు కలుషితమై డయేరియా ప్రబలినట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం నుంచి ప్రజలు వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. సుభాష్‌నగర్, శాంతిఖని, 65 డీప్ ఏరియా, 85 డీప్ ఏరియా, నం.2 ఇంక్లైన్, బెల్లంపల్లిబస్తీలకు చెందిన సుమారు 100 మంది వరకు కలుషిత నీరు తాగి వాంతులు, విరేచనాల బారిన పడ్డారు. ఆహారం భుజించిన, నీరు తాగిన వెంటనే వాంతులు, విరేచనాలు చేసుకుంటున్నారు.
నీరు కలుషితం కావడం వల్లే
వాంతులు, విరేచనాలతో బాధపడుతూ రెండు రోజుల నుంచి రోగులు ఆస్పత్రికి వస్తున్నారు. బుధవారం పదిహేను మంది రోగులు ఆస్పత్రిలో చేరారు. వీరికి సత్వరంగా వైద్యం అం దించడంతో ఆరోగ్యం కుదుటపడి ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. గురువారం పెద్ద సంఖ్యలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం 34 మంది ఆస్పత్రిలో ఇన్‌పేషంట్లుగా ఉన్నారు. వీరంతా కలుషితమైన నీరు తాగడం వల్లే వాంతులు, విరోచనాలు చేసుకుంటున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - కుమారస్వామి, ప్రభుత్వ వైద్యుడు ( బెల్లంపల్లి)