నల్లసూరీళ్లకు శుభవార్త..!
మంచిర్యాల సిటీ : సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ఇవ్వబోతోంది. ఆదాయపు పన్ను చెల్లింపుపై నజరానా ప్రకటించబోతోంది. ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. ఏటా ఒక్కో కార్మికుడు రూ.20 నుంచి 30 వేల వరకు ఆదాయపు పన్ను చెల్లించేవారు. అయితే.. శనివారం సింగరేణి కార్మికులపై ప్రభుత్వం ప్రేమ చూపుతూ ఆదాయపు పన్ను నుంచి కార్మికులకు మినహాయింపు ఇచ్చేలా తీర్మానం చేసింది. ఇది అమల్లోకి వస్తే కార్మికులకు ఆదాయపు పన్ను భారం నుంచి విముక్తి లభించినట్లే.
ఆదాయపు పన్ను చెల్లింపు..
2011-12 ఆర్థిక సంవత్సరంరలో రూ.లక్షా 80 వేల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉండేది. 2012-13, 2013-14లో రెండు లక్షల రూపాయలకు సవరణ చేస్తూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో కార్మికులకు కొంత మేర ఉపశమనం లభించినా.. ఏడాదిలో ఒక నెల వేతనం మాత్రం ఆదాయపు పన్ను రూపేణా చెల్లించేవారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో శనివారం సింగరేణి బొగ్గు గని కార్మికులు ఏటా చెల్లించే ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఒకవేళ ఈ విధానం అమల్లోకి రాకుంటే.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆదాయపు చెల్లింపుపై రూ.5 లక్షల వరకు పరిమితి పెంచేలా ఆలోచిస్తోంది. ఇందుకు ఆర్థిక నిపుణులకు ఆదేశాలు సైతం ఇచ్చింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినా కార్మికులందరికీ ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు లభించినట్లే.
జిల్లాలో 21 వేల మంది కార్మికులు..
జిల్లాలో శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి ఏరియాలను కలిపి బెల్లంపల్లి రీజియన్‌గా పిలుస్తుంటారు. వీటి పరిధిలో 21 వేల మంది కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంతో ఈ కార్మికులంతా లాభపడనున్నారు. గతంలో ఎన్నికల్లోనూ ఆయా బెల్ట్‌ల పరిధిలో పోటీ చేసిన అభ్యర్థులు ఆదాయపు పన్ను రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు.
ఆ మేరకు వారు కూడా కృషి చేస్తుండడం కార్మికుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు దేశంలో నౌకాయానం, విమానయానం, సైనిక రంగాల్లో పనిచేస్తున్న వారికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది. బొగ్గు పొరలను చీల్చుకుంటూ.. ప్రాణాలను ఫణంగా పెడుతున్న సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. ఈసారైనా తమ కల నెరవేర్చాలని కార్మికులు కోరుతున్నారు.
శాశ్వత రద్దు కావాలంటే..?
సింగరేణి కార్మికులతోపాటు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న కోల్ ఇండియాలో సుమారు 5 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ఆదాయపు పన్ను రద్దు కావాలంటే లోకసభలో బిల్లు ఆమోదం పొందాలి. ఇందుకోసం దేశంలోని బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతాల్లో గెలుపొందిన పార్లమెంటు సభ్యులను ఈ ప్రాంత పార్లమెంటుసభ్యులు ఏకతాటి పైకి తీసుకురావాలి. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే ఫలితం ఉంటుంది.