ఒంటరి పోరాటం
పవర్ ప్లాంట్ నిర్మాణం.. భూమి పోయినా చిన్నపాటి ఉద్యోగం వస్తుందిలే అనే ఆశ.. తీరా పనులు మొదలయ్యూయి.. ప్రస్తుతం పనిచ్చేవారు.. పట్టించుకునేవారు కరువయ్యూరు.. ప్లాంట్ సందర్శనకు వచ్చిన ఉన్నతాధికారులు ముందొకమాట.. తర్వాతో మాట.. నిర్వాసితుల పక్షాన నిలవాల్సిన పార్టీలు రంగులు మార్చి వ్యవహరిస్తున్నారుు..భూములు కోల్పోరుు.. కొలువు కావాలని కోరుతున్న యువతీ యువకులు ఏకాకులుగా మిగిలారు.. ఒంటరి పోరాటం సాగిస్తున్నారు.
- ‘పవర్’ నిర్వాసితుల పరేషాన్
- వీరిపక్షం వహించేదెవరు?
- లబ్ధి కోసమే నేతల డ్రామా
- ఉపాధి ఊసెత్తని ఉన్నతాధికారులు
- ప్రశ్నార్థకంగా భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్వాసితుల భవిష్యత్
పినపాక: మండలంలోని ఉప్పాక పంచాయతీ సీతారాంపురం గ్రామం వద్ద భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులు ఉపాధి కోసం పోరుబాట పట్టారు. కొన్ని పార్టీలు నిర్వాసితుల పక్షాన నిలవాల్సిందిపోయి.. పోరాటం చేస్తున్నట్లు ఒక పక్క నటిస్తూ.. మరోవైపు విద్యుత్ ప్లాంట్‌లో జరుగుతున్న పనులపై ఆధిపత్యం కోసం పావులు కదుపుతుండటాన్ని నిర్వాసితులు గమనించారు. ఎవరి మద్దతు లేకుండా నిర్వాసితులు పోరాటాలు చేసేందుకు సిద్ధమయ్యూరు. ఈ తరుణంలో పార్టీల నాయకులు రంగప్రవేశం చేసి నిర్వాసితుల నోరు నొక్కేస్తున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి.
కొన్ని నెలలుగా తమకు రావాల్సిన పరిహారం, ఐటీఐలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలపై నిర్వాసిత కుటుంబాలు ఆందోళనలు చేస్తున్న విషయం విదితమే. ప్రతి సందర్భంలో నాయకులు నిర్వాసితుల పక్షాన నిలబడినట్లు నటించి అధికారుల తాత్కాలిక హామీలు తీసుకొని మమ అనిపించిన సంఘటనలు అనేకం. వీటితో విసిగి వేసారిన నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు, పినపాక మండలాల్లో ఉన్న భూ నిర్వాసితులు ఏకతాటిపైకి వచ్చారు. శుక్రవారం భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో పనుల పరిశీలనకు వచ్చిన టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిశారు. ఆయన నుంచి సరైన సమాధానం రాకపోవడం.. స్థానిక అధికారుల తీరుకు నిరసనగా శనివారం భద్రాద్రి పవర్ ప్లాంట్ ఎదుట రాస్తారోకోకు దిగారు.
రాస్తారోకోకూ రంగేశారు!
రాస్తారోకోకు ప్రధాన పార్టీల నాయకులు మద్దతు తెలిపి రాజకీయ రంగు పులమడం గమనార్హం. భూ నిర్వాసితుల పక్షాన సుమారు 2 గంటలపాటు రాస్తారోకో చేసిన పార్టీల నాయకులు ఒక్కసారిగా ఆందోళన నుంచి లేచి నిర్వాసితులను ఆందోళన విరమించాలని కోరడం విశేషం. అసలు ఎవరి కోసం ఆందోళనకు మద్దతు తెలిపారని, అధికారుల నుంచి ఎలాంటి హామీ రాకుండానే ఆందోళన విరమించమని చెప్పడం ఏమిటని నిర్వాసితులు ప్రశ్నించారు. శనివారం రాస్తారోకోకు దిగిన భూ నిర్వాసితులకు సర్ది చెప్పేందుకు వచ్చిన పార్టీల నాయకులకు ఇలా చేదు అనుభవం ఎదురైంది. మాకు రాజకీయం అవసరం లేదని.. నాయకుల మాటలు వినమని నిర్వాసితులు తెగేసి చెప్పారు.
‘అసలు మీరు ఎందుకు వచ్చారు? ఎవరికి న్యాయం చేస్తారు? గతంలో ఎన్ని హామీలు ఇచ్చారు? 6 నెలల నుంచి ఏం సాధించారు?’ అంటూ ప్రశ్నల తూటాలు సంధించారు. తమకు ప్రభుత్వం నుంచి సరైన హామీ వచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని తెలిపారు. ఈ ఊహించని పరిణామంతో రాస్తారోకోలో పాలుపంచుకున్న వివిధ పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. నిర్వాసితులను బతిమాడో..బామాడో ఆందోళన విరమించేలా చేశారు.
ప్రశ్నర్థకంగా భవిష్యత్
భూములు కోల్పోయిన భద్రాద్రి భూ నిర్వాసితుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వాసితుల తరఫున పోరాడేందుకు ఒక్క పార్టీ ముందుకు రాకపోవడం గమనార్హం. భూ నిర్వాసితుల్లో ఉన్న ఆగ్రహాన్ని రెచ్చగొట్టి.. రాజకీయ ప్రయోజనాల కోసం వారిని ఆందోళన బాట పట్టిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తానికి నిర్వాసితులకు అందాల్సిన పరిహారం, ఐటీఐలో ప్రవేశాలు, ఉద్యోగావకాశాలు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల ద్వారా ప్రశాంత వాతావరణంలో సాధించుకునేందుకు మార్గాలు ఎంచుకోవాల్సి ఉంది. పార్టీల మాయలో పడి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసుకోకుండా భూ నిర్వాసితులు ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు నిరసన తెలిపిన వారిపై కేసులు నమోదవడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
భూ నిర్వాసితులపై కేసు నమోదు
పినపాక : సీతారాంపురం గ్రామం వద్ద గల భద్రాద్రి పవర్ ప్లాంట్‌లో జెన్కో అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించిన భూ నిర్వాసితులపై ఏడూళ్ళబయ్యారం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ జీడి సూర్య ప్రకాష్ తెలిపిన ప్రకారం.. పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వర్తిస్తున్న జెన్కో అధికారులు, సిబ్బంది విధులకు పినపాక, మణుగూరు మండలాలకు చెందిన ఏడూళ్ళబయ్యారం, చిక్కుడుగుంట, సాంబాయిగూడెం, సీతారాంపురం గ్రామాలకు చెందిన 13మంది ఆటంకం కలిగించారు.