దూరం..భారం
ఫలితమివ్వని జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం
జనావాసాలకు దూరంగా ఇళ్ల నిర్మాణం
ఉపాధికి ఇబ్బందులు సౌకర్యాలూ అంతంతమాత్రమే
అదో మహత్తర పథకం. పేదలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో రూ.1124 కోట్లు వెచ్చించి చేపట్టిన పథకం. ఆచరణకు వచ్చేసరికి ఎవరికీ ‘అందనంత’ దూరమైపోయింది. జనావాసాలకు దూరంగా... ఏ సౌకర్యాలు... ఉపాధి లభించ ని చోట చేపట్టిన ఆ పథకం లక్ష్యం చేరుకునే మార్గం తెలియక యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. అదే జేఎన్‌ఎన్‌యూర్‌ఎం గృహ నిర్మాణం.
సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ద్వారా నిర్మించిన ఇళ్లు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. ఈ పథకం కింద రూ.1124 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 78,746 ఇళ్లు నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయినా పూర్తి స్థాయిలో వీటిని నిర్మించలేదు. నిర్మాణం పూర్తయిన అన్ని ఇళ్లలోనూ లబ్ధిదారులు చేరలేదు. సమస్య తెలిసినప్పటికీ పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులు శ్రద్ధ చూపలేదు.దీంతో ఇది నిష్ర్పయోజనంగా మారింది. ఇతర పథకాల్లో పూర్తి చేసిన ఇళ్లను సైతం దీనిలో చేర్చినప్పటికీ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. జనావాసాలకు దూరంగా... లబ్ధిదారులు ఉపాధి కోసం వెళ్లేందుకు వీలు లేని ప్రాం తాల్లో ఇళ్లు నిర్మించడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పూర్తయిన ఇళ్లలో తాగునీటి సరఫరా వంటి కనీస సదుపాయాలు లేవు. దీంతో ఇళ్లలో దిగేందుకు ముందుకొచ్చేవారు కరువయ్యారు. ఈ పరి స్థితి కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం కాలేదు. దేశ రాజ దాని ఢిల్లీలో సైతం 60 వేల ఇళ్లు లబ్ధిదారులు చేరక ఖాళీగా ఉన్నాయి. ఈ విషయాన్ని మంగళవారం జీహెచ్‌ఎంసీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సమీర్‌శర్మ ప్రస్తావించారు. ఓ వైపు దేశవ్యాప్తంగా కోటి 80 లక్షల ఇళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, పూర్తవుతున్న వాటిలో చేరేవారు లేకపోవడం ఆశ్చర్యం గొలుపుతోందన్నారు. జీవనోపాధి కోసం ఎంతో దూరం వెళ్లాల్సి రావడం.. అందుకు ఎంతో సమయం పడుతుండడం వంటివి కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి.
ఆర్థిక సమస్యలు
మరోవైపు లబ్ధిదారులకు తమవంతు కంట్రిబ్యూషన్ చెల్లించే స్థోమత లేకపోవడం.. రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడం... పిల్లల విద్యకు దూరంగా ఉండడం కూడా జనాలు ఈ ఇళ్ల వైపు చూడకపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. లబ్ధిదారుల ఎంపిక.. వారికి బ్యాంకు రుణాలు ఇప్పించడం వంటి వాటిలో అధికార యంత్రాంగం శ్రద్ధ చూపకపోవడం పథకం నీరుగారడానికి మరో ప్రధాన కారణం. మరోవైపు పూర్తయిన ఇళ్లలో చేరేం దుకు లబ్ధిదారులు వెనుకడుగు వేస్తుండడంతో వాటి దర్వాజాలు, తలుపులు దొంగల పాలవుతున్నాయి. అధికారులు స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేయాలి.