మళ్లీ ‘గ్రీన్‌ జోన్‌’లోకి.. | Better air quality in Telugu states | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘గ్రీన్‌ జోన్‌’లోకి..

Published Wed, Jun 17 2020 3:05 AM | Last Updated on Wed, Jun 17 2020 3:05 AM

Better air quality in Telugu states - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ మన నగరాలు ‘గ్రీన్‌జోన్‌’లోకి అడుగుపెట్టాయి. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలు, పట్టణాలు స్వచ్ఛమైన గాలులను ఆస్వాదిస్తున్నాయి. ఇటీవల లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతోనే దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వాయు కాలుష్యం పెరిగిపోయింది. అంతకుముందు దాదాపు 2 నెలలకు పైగా అమల్లో ఉన్న లాక్‌డౌన్‌తో వాహనాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఫ్యాక్టరీల కార్యకలాపాలు నిలిచిపోవడం, అంతా ఇళ్లకే పరిమితం కావడంతో కాలుష్యం తగ్గి పర్యావరణం కోలుకోవడం మొదలైంది. స్వచ్ఛమైన గాలి, ప్రకృతి పులకరింతలతో వన్యప్రాణులు, జంతువులు, పక్షులు స్వేచ్ఛగా సంచరిస్తూ కనువిందు చేశాయి. లాక్‌డౌన్‌ ఎత్తేశాక రెండంటే రెండు రోజుల్లోనే అన్ని కాలుష్యాలు పెరగడంతో మళ్లీ పరిస్థితులు యథాస్థితికి వచ్చాయి.

ఈ క్రమంలోనే నైరుతి రుతుపవనాలు రెండు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. రుతుపవనాల ప్రవేశానికి సూచికగా కురుస్తున్న వర్షంతో వాయు కాలుష్యం గణనీయంగా తగ్గి నాణ్యత పెరిగింది. ఎంతగా అంటే తెలుగు రాష్ట్రాల్లోని వాయు నాణ్యత సూచీ.. గుడ్‌ కేటగిరీలో చేరిపోయింది. హైదరాబాద్, అమరావతి నగరాల్లో ఎయిర్‌ క్వాలిటీ టాప్‌ ర్యాంక్‌లో చేరాయనడానికి సూచికగా మంచి వాయు నాణ్యత స్థాయిలను రికార్డ్‌ చేశాయి. వర్షాలు పడటం మొదలుకాగానే వాయునాణ్యత పెరుగుతుందని, కాలుష్యం తగ్గుతుందని ‘సాక్షి’కి టీపీసీబీ ఎయిర్‌లాబ్స్‌ ఇన్‌చార్జీ, సైంటిస్ట్‌ డా.ప్రసాద్‌ తెలిపారు. అయితే మళ్లీ ఎండలొస్తే రోడ్లపై సిల్ట్, దుమ్మూధూళితో మళ్లీ పొల్యూషన్‌ పెరిగే అవకాశాలున్నాయని, చలికాలంలోనూ చల్లదనం కారణంగా వాతావరణ ప్రతికూలతలు, ఇతరత్రా కారణాలతో వాయు కాలుష్యం పెరుగుతుందని వెల్లడించారు.

ఎయిర్‌ క్వాలిటీ పర్యవేక్షణ..
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) ‘సమీర్‌ యాప్‌’ ద్వారా వాస్తవ సమయం–రియల్‌ టైమ్‌లో దేశవ్యాప్తం గా వందకు పైగా ముఖ్య నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత, వివిధ కాలుష్య స్థాయిల ను పరిశీలించి ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) గణాంకాల సూచీని ఆన్‌లైన్‌ లో ఎప్పటికప్పుడు వెల్లడిస్తోంది. మంగళవారం సాయంత్రం 4.48కి సీపీసీబీ అప్‌డేట్‌ చేసిన ఏక్యూఐ తాజా వివరాలు
► హైదరాబాద్‌లో వాయు నాణ్యత 31 పాయింట్లుగా రికార్డు.
► సనత్‌నగర్, బొల్లారం, జూలాజికల్‌ పార్కు, హైదరాబాద్‌ సెంట్రల్‌ వర్సిటీ, పాశమైలారం, పటాన్‌చెరుల్లో ఆటోమేటిక్‌ సాధనాల ద్వారా, మ్యానువల్‌గానూ గాలి నాణ్యతను నమోదు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement