కరోనా కమ్ముకొచ్చినా.. పర్యావరణ ప్రేమికులు మాత్రం ఈ మహమ్మారి వల్ల భూమికి కొద్దోగొప్పో మేలే జరిగిందని చెబుతున్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఇటలీ నగరం వెనిస్‌లో నీళ్లు స్వచ్ఛమై డాల్ఫిన్లు మళ్లీ తిరిగొచ్చాయని.. తిరుమల ఘాట్ రోడ్లపై జింకలు యథేచ్ఛగా తిరుగాడాయన్న వార్తలూ మనం చూశాం. అయితే మిగిలిన ప్రాంతాల మాట ఎలా ఉన్నా.. దేశంలోని 22 ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింది పాక్షికంగానే అంటోంది.. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్..
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కాలంలో వాయుకాలుష్యం పాక్షికంగానే తగ్గింది. వాయుకాలుష్యంలో కీలకమైన పార్టిక్యులేట్ మ్యాటర్ (పీఎం) 2.5, నైట్రస్ ఆక్సైడ్ (ఎన్‌ఓ2)లు తగ్గిపోగా, ఇంకో కాలుష్యకారక వాయువు ఓజోన్ మాత్రం పెరిగిపోయిందని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ఓజోన్ కాలుష్యం వేసవిలో ఎక్కువగా ఉండటం సాధారణం. ఏడాదిలో మిగిలిన సమయాల్లో ఈ కాలుష్య కారక వాయువు మోతాదుల్లో హెచ్చుతగ్గులుంటాయి. కానీ తక్కువ కాలం మాత్రమే వాతావరణంలో ఉండే ఓజోన్‌తో సమస్యలు చాలా ఎక్కువ. కేవలం ఒక్క గంటపాటు ఓజోన్ ఎక్కువగా ఉన్న వాతావరణంలో ఉంటే ఉబ్బసం, శ్వాస సమస్యలున్నవారి ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుంది.
వాహనాల పొగలోంచి విడుదలయ్యే నైట్రస్ ఆక్సైడ్, ఇతర వాయువులు సూర్యుడి సమక్షంలో రసాయన చర్య జరపడం వల్ల ఓజోన్ పుడుతూ ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే ఓజోన్ మోతాదును నియంత్రించాలంటే కాలుష్య కారక వాయువుల విడుదల పూర్తిగా ఆగిపోవాలన్నమాట. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా వాయు కాలుష్యంపై ఓ సర్వే నిర్వహించింది. దేశ రాజధాని ఢిల్లీతోపాటు దాదాపు 15 రాష్ట్రాలోని 22 నగరాల్లో పీఎం 2.5, పీఎం 10, ఎన్‌ఓ2లతో పాటు ఓజోన్ మోతాదులు ఎంతున్నాయో లెక్కకట్టింది. గతేడాది జనవరి ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది మే 31 వరకున్న సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. నాలుగు మెట్రో నగరాలు సహా హైదరాబాద్, విశాఖపట్నం, అహ్మదాబాద్, ఉజ్జయిని, జైపూర్, జోధ్‌పూర్, పట్నా, అమృత్‌సర్, హౌరా, పుణే, గువాహటి, లక్నో, కొచ్చిల్లో ఈ సర్వే నిర్వహించింది.
ఓజోన్ ఎక్కువగానే..
ఫిబ్రవరి–ఏప్రిల్ మధ్యకాలంలో ఉత్తర, మధ్య, పశ్చిమభారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఓజోన్ సమస్య ఎక్కువగా ఉండగా.. దక్షిణాది, సముద్రతీర నగరాల్లో చలికాలాల్లో ఎక్కువగా ఉంటోంది. లాక్‌డౌన్ సమయంలో చాలా రోజుల పాటు ఓజోన్ మోతాదు నిర్ణీత పరిధి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఢిల్లీలో లాక్‌డౌన్ కాలంలో 66 శాతం రోజుల్లో ఓజోన్ ఎక్కువగా ఉంటే అహ్మదాబాద్, ఉజ్జయినిలోనూ నెలకంటే ఎక్కువ రోజులు ఓజోన్ కాలుష్యం పీడించింది. ఇక చెన్నై, ముంబైల్లో మాత్రం ఏ ఒక్క రోజూ ఓజోన్ మోతాదుకు మించి లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా.. దేశంలోని ప్రధాన నగరాల్లో స్వచ్ఛంగా ఉన్న ప్రాంతాల్లో ఎన్‌ఓ2 తక్కువగా ప్రాంతాల్లో ఓజోన్ ఎక్కువగా పోగుబడటం సీఎస్‌ఈ గుర్తించింది.
పీఎం 2.5 మోతాదు కంటే తక్కువ
ఇక పీఎం 2.5 కాలుష్యం విషయాన్ని తీసుకుంటే.. లాక్‌డౌన్ సమయంలో ఇది గణనీయంగా తగ్గింది అనేందుకు స్వచ్ఛమైన నీలాకాశమే సాక్ష్యం. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లాక్‌డౌన్ సమయంలో దేశంలోని 22 ప్రధాన నగరాల్లోనూ పీఎం 2.5 మోతాదు బాగా తక్కువగా ఉన్నట్లు సీఎస్‌ఈ సర్వే ద్వారా తెలిసింది. ప్రాంతాల వారీగానూ ఈ కాలుష్య కారక వాయువు మోతాదులో తగ్గుదల నమోదైందని తెలిపింది. గంగా పరీవాహక ప్రాంతంలో ప్రతి ఘనపు మీటర్‌కు 7 నుంచి 31 మైక్రోగ్రాముల పీఎం 2.5 నమోదు కాగా, రాజస్తాన్, గుజరాత్‌లలో ఇది మరింత తక్కువగా 9 నుంచి 20 మైక్రోగ్రాములుగా ఉంది. దక్కన్ పీఠభూమిలో సగటున 12 నుంచి 18 మైక్రో గ్రాములు/ఘనపుమీటర్ పీఎం 2.5 నమోదైనట్లు సీఎస్‌ఈ తెలిపింది. ఇక లాక్‌డౌన్ నిబంధనల సడలింపుతో మరోసారి పీఎం 2.5 మోతాదులు పెరగడం మొదలుపెట్టాయని, లాక్‌డౌన్ సమయంలో నమోదైన సగటు పీఎం 2.5 కంటే ఎత్తివేత తర్వాత చెన్నైలో 118 శాతం పెరుగుదల నమోదైంది.
లాక్‌డౌన్ ఎత్తివేతతో ఎన్‌ఓ2 సాధారణ స్థితికి..
లాక్‌డౌన్ సమయంలో బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గువాహటి, హౌరా, జోధ్‌పూర్, లక్నో, కోల్‌కతాల్లో ఎన్‌ఓ2 63 శాతం వరకూ తగ్గిపోగా, దక్కన్ పీఠభూమిలోని నగరాల్లో ఎన్‌ఓ2 4 నుంచి 13 మైక్రోగ్రాములు/ఘనపుమీటర్ మాత్రమే నమోదైంది. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేయడం మొదలుకొని రహదారులపై వాహనాల సంచారం మొదలై సగటు ఎన్‌ఓ2 మళ్లీ సాధారణ స్థితికి చేరుకుందని సీఎస్‌ఈ వివరించింది.
ఏం చేయాలి?
దేశ ప్రజలందరికీ స్వచ్ఛమైన గాలి అందేలా చేసేం దుకు ప్రభుత్వాలు చేపట్టాల్సిన చర్యలను సీఎస్‌ఈ ఈ సర్వేలో వివరించింది. బీఎస్–6 కాలుష్య నియంత్రణ వాహనాలను జాప్యం లేకుండా అమల్లోకి తేవాలి. బీఎస్–6 ప్రమాణాలున్న భారీ వాహనాల కొనుగోలుకు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ నిధుల ద్వారా ప్రోత్సాహకాలివ్వాలి. ఆటో రిక్షాలు మొదలుకొని అన్ని రకాల వాహనాలకూ ఈ ప్రోత్సాహకాలు అందేలా చూడాలి. పాత వాహనాలు ఇతర నగరాల్లో, ప్రాంతాల్లో ప్రత్యక్షం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, పాదచారులను, సైకిల్ వినియోగదారులను ప్రోత్సహించడం అవసరం. వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయడంతో పాటు కార్యాలయాలను వేర్వేరు సమయాల్లో పనిచేసేలా చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment