ప్రజలకు మెరుగైన సేవలందించాలి | Better serve the public | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలందించాలి

Published Sun, Sep 21 2014 1:39 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 PM

నిబంధనలు అతిక్రమించకుండా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్ ప్రదీప్‌చంద్ర అధికారులకు సూచించారు.

  • సంస్థ పేరు నిలబెట్టాలి
  •   హెచ్‌ఎండీఏ అధికారులకు ఇన్‌చార్జి కమిషనర్ సూచన
  •   ప్రధాన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ప్రదీప్‌చంద్ర
  • సాక్షి, సిటీబ్యూరో: నిబంధనలు అతిక్రమించకుండా.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని హెచ్‌ఎండీఏ ఇన్‌చార్జి కమిషనర్ ప్రదీప్‌చంద్ర అధికారులకు సూచించారు. శనివారం ఆయన హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో కొత్తగా లక్ష్యాలుంటాయని, అందుకు తగ్గట్టుగా పనిచేయాల్సి ఉంటుందని సూచించారు. ప్రజలకు నేరుగా సేవలందించాలన్నది కొత్త ప్రభుత్వ ఉద్దేశమన్నారు. అందుకు అనుగుణంగా హెచ్‌ఎండీఏ అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.  ఫైళ్లను పెండింగ్‌లో పెట్టొద్దని, తనను తప్పుదారి పట్టించొద్దని చెప్పారు.

    పనుల కోసం హెచ్‌ఎండీఏకు వచ్చిన వారంతా సంతోషంగా తిరిగి వెళ్లే విధంగా పరిస్థితులను కల్పించాలన్నారు. పరిపాలనాపరంగా ఏవైనా అనుమానాలుంటే వెంటనే సచివాలయానికి రావాలని, అవసరమైతే తానే తార్నాకకు వ చ్చి రెండు, మూడు గంటలు అదనంగా పనిచేస్తానని తెలిపారు. ఆయా విభాగాల పనితీరు, ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ బడ్జెట్, ప్రస్తుత ఆర్థిక పరిస్థితి గురించి ఆరా తీశారు. ఐటీ బకాయిల కింద తక్షణం రూ.500 కోట్లు చెల్లించాల్సి విషయాన్ని ఈ సందర్భంగా సీఏఓ ఆయనకు వివరించారు.
     
    సంస్థకు నెలవారీ ఆదాయం, రుణాలకు చెల్లించే వడ్డీలు, సిబ్బంది జీతభత్యాలు, ఇతర నిర్వహణ ఖర్చుల జాబితాను ఇన్‌చార్జి కమిషనర్‌కు అందించారు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. భూ సేకరణలో కోర్టు కేసులు తదితర సమస్యల వల్ల నిర్మాణంలో జాప్యం జరిగిన విషయాన్ని ఓఆర్‌ఆర్ అధికారులు ప్రదీప్‌చంద్రకు వివరించారు. ప్రధానంగా ప్లానింగ్ విభాగంలో ఫైళ్లు పెండింగ్‌లో లేకుండా చూడాలని అధికారులను  ఆదేశించారు. విభాగాల వారీగా సోమవారం సమీక్ష జరుపుతానని ఇన్‌చార్జి కమిషనర్ ప్రదీప్‌చంద్ర తెలిపారు.
     
    హెచ్‌ఎండీఏకు వీడిన గ్రహణం

    కమిషనర్ నీరభ్‌కుమార్ బదిలీ కావడంతో హెచ్‌ఎండీఏకు గ్రహణం వీడింద ని, సంస్థకు మంచిరోజులు వచ్చినట్లేనని ఆ సంస్థ ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి, ఆ మొత్తాన్ని చెల్లించాకే ఫైళ్లు పరుగెత్తించడం హెచ్‌ఎండీఏలో ప్రత్యేకత. కిందిస్థాయి సిబ్బంది ఏదైనా పొరపాటు చేస్తే... ఉన్నతాధికారి చర్య లు తీసుకొంటారు. అయితే... మహానగరాభివృద్ధి సంస్థలో మాత్రం కంచే చేను మేస్తుండటంతో రెండేళ్లుగా ఈ సంస్థ అక్రమాలు పుట్టగా మారిందన్న ఆపకీర్తిని మూటగట్టుకొంది.

    ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలోని ఓ మంత్రి బంధువు లేఅవుట్ అభివృద్ధి కోసం హెచ్‌ఎండీఏకు దరఖాస్తు చేసుకోగా అప్రూవల్ కోసం ఉన్నతాధికారి రూ.5 కోట్లు డిమాండ్ చేశారని, దీంతో ఆగ్రహించిన ఆ మంత్రి పట్టుబట్టి బదిలీ చేయించారని ప్రచారం జరిగింది. ఇటీవల అప్రెడా సమావేశంలో సదరు ఉన్నతాధికారిపై భారీగా ఫిర్యాదులందాయి. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా సీఎం సలహాదారు ఒకరు కల్పించుకొని బదిలీని వాయిదా వేయించినట్టు సమాచారం. అయినా... సదరు ఉన్నతాధికారి వ్యవహార తీరులో మార్పు రాకపోగా... ఎలాగూ బదిలీ తప్పదన్న ఉద్దేశంతో వసూళ్ల పరంపరను కొనసాగించినట్టు తెలిసింది.
     
    ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో రెండ్రోజుల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారిపై పలువురు పారిశ్రామిక వేత్తలు నేరుగా సీఎంకు ఫిర్యాదు చేశారు. ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన కేసీఆర్ అక్కడి నుంచే సీఎస్‌ను ఆదేశించి నీరభ్‌కుమార్‌పై వేటు వేయించిన విషయం తెల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement