3 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవం  | Bhakthi TV Koti Deepothsavam 2019 Starts From 3rd November | Sakshi
Sakshi News home page

3 నుంచి భక్తిటీవీ కోటిదీపోత్సవం 

Published Fri, Nov 1 2019 3:41 PM | Last Updated on Fri, Nov 1 2019 3:41 PM

Bhakthi TV Koti Deepothsavam 2019 Starts From 3rd November - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏటా నిర్వహించే భక్తిటీవీ కోటిదీపోత్సవానికి నగరం ముస్తాబవుతోంది. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ వేడుక జరుగుతుందని నిర్వాహకులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజూ సాయంత్రం 5.30కు కోటి దీపోత్సవం ప్రారంభం కానుంది. ‘పూరీ శంకరాచార్య జగద్గురు నిశ్చలానంద సరస్వతి స్వామి, ఉడుపి పెజావర్‌ పీఠాధిపతి విశ్వేశరతీర్థ, బాబా రామ్‌దేవ్, గణపతి సచ్చిదానంద, త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్‌స్వామి, విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపానందేంద్ర’ వంటి ప్రసిద్ధ గురువులు చేతులమీదుగా పూజా కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి విఖ్యాత ప్రవచనకర్తలు విచ్చేయనున్నట్టు వివరించారు. భక్తులే స్వయంగా విశేష పూజలు చేసే విధంగా కార్యక్రమాలు జరగుతాయని, సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఉంటాయని పేర్కొన్నారు.

కోటిదీపోత్సవం ప్రత్యేకత..
కార్తికమాసం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తిటీవీ కోటిదీపోత్సవంలో దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటికాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, డమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహభాషణాలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజల వంటివి ఎన్నో భక్తుల మనసులను భక్తిపారశ్యంలో మునకలు వేయిస్తాయి. భక్తిటీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటిదీపోత్సవం ఈ ఏడాది హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా నవంబరు 3 నుంచి 18వ తేదీవరకు జరగనుంది. 

శుభారంభం.. లక్షదీపోత్సవం
2012లో లక్ష దీపాల అంకురార్పణతో ఈ మహాదీపయజ్ఞం ప్రారంభమైంది. 2013 నుంచి ఆధ్యాత్మిక జగత్తులో మహోద్యమంగా కొనసాగుతోంది. భక్తిటీవీ అధినేత నరేంద్ర చౌదరి సంకల్పంతో  ఏడు సంవత్సరాలుగా  అవిచ్ఛిన్నంగా ఈ సంప్రదాయం కార్తికంలో అందరినీ పలకరిస్తూనే ఉంది. ఆశేష భక్తజనుల మనసుల్లో చెరగని ముద్రవేసిన భక్తిటీవీ కోటిదీపోత్సవం.. ఎనిమిదోసారి  అంగరంగవైభవంగా జరగనుంది.

భువిపై కైలాసం
బొందితో కైలాసాన్ని చూడకపోవచ్చుకానీ.. కోటిదీపోత్సవ వేదికను చూస్తే ఆ లోటు తీరుతుంది. ఈ వేడుకకు విచ్చేసే ప్రతీఒక్కరినీ కళ్లార్పకుండా చేసేది ప్రధాన వేదిక. ఎత్తైన హిమగిరులు.. జలపాతాలు.. యోగముద్రలో సదాశివుడు.. శిఖరాలపై మహాదేవుని విభిన్నమూర్తులు.. శివలింగాలు వెరసి... అది కైలాస ప్రతిరూపం కాదు.. కైలాసమే అనిపించకమానదు. అటువంటి మహావేదిక 2019 కోటిదీపోత్సవ వేడుక కోసం సిద్ధమవుతోంది. శంఖారావం మొదలు కార్యక్రమం సమాప్తమయ్యేంతవరకు మహాకైలాస వేదికే కోటిదీపోత్సవ రంగస్థలి. ఈ వేదికపైనే వేదమంత్రఘోష ప్రతిధ్వనిస్తుంది. ఈ వేదికపైనే నియమ నిష్ఠాగరిష్ఠులైన జగద్గురువులు వేంచేస్తారు. ఈ వేదికపైనే సకలదేవతలూ కల్యాణోత్సవాలను జరిపించుకుంటారు. ఈ వేదికపైనే కోటిదీపాల యజ్ఞానికి నాందిగా తొలి దీపం వెలుగుతుంది. ఈ వేదికపైనే దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో అలరిస్తారు. కోటిదీపోత్సవ వేదిక అంటే అది కళ్లముందు కనిపించే కైలాసం. మహాదేవుని సమక్షంలో కోటిదీపోత్సవం జరిగే దివ్యస్థలం. 

జగద్గురువుల అనుగ్రహభాషణం                                                        
కోటిదీపోత్సవానికి దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధ జగద్గురువులు, పీఠాధిపతులు తరలివస్తారు. ఆశీర్వచనపూర్వకంగా అనుగ్రహభాషణం చేస్తారు. ఇటువంటి అద్భుత పర్వానికి ఈ ఏడాది సైతం ప్రసిద్ధ పీఠాధిపతులు, జగద్గురువులు తరలివస్తున్నారు. వారి చేతులమీదుగానే తొలి దీపారాధన జరగుతుంది. పూరీ శంకరాచార్య జగద్గురు శ్రీనిశ్చలానందసరస్వతి, ఉడుపి పెజావర్ పీఠాధిపతి శ్రీవిశ్వేశ తీర్థస్వామీజీ , బాబా రామ్‌దేవ్‌, శ్రీగణపతి సచ్చిదానందస్వామీ, ఆర్ట్ ఆఫ్‌ లివింగ్ శ్రీశ్రీరవిశంకర్‌ గురూజీ వంటి ప్రసిద్ధ గురువులతో పాటు.. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, గరికిపాటి నరసింహారావు వంటి ప్రసిద్ధ ప్రవచనకర్తలు విచ్చేయనున్నారు. గురు సమక్షంలో జరిగే దీపారాధన మరింత పుణ్యప్రదమని కార్తిక పురాణ వచనం. అందుకే నియమనిష్ఠాగరిష్టులైన కాషాయాంబరధారుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో పాల్గొనడం కోటి జన్మల పుణ్యఫలం. సమాజంలో ఉన్నత హోదాల్లో ఉన్నవారు, లబ్దప్రతిష్టులు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు, కేంద్రమంత్రులు, న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సైతం ఈ వేడుకలో ఆనందంగా పాల్గొంటారు. 

జన్మజన్మల పుణ్యఫలం
కోటిదీపోత్సవం అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు... పాల్గొనే ప్రతీ భక్తుడికి ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక అనుభవాలు పదిలపర్చుకునే మహాపర్వం. కూర్చున్నచోటు నుంచే మహాదేవునికి జరిగే సహస్రకలశాభిషేకాన్ని వీక్షించవచ్చు. శివలింగానికి స్వయంగా బిల్వార్చనలు చేయవచ్చు. భస్మంతో అభిషేకించవచ్చు. రుద్రాక్షలతో పూజించవచ్చు. పసుపుకొమ్ములతో అమ్మవారిని ఆరాధించవచ్చు. సౌభాగ్యం కోసం అమ్మవార్లకు కోటి కుంకుమార్చన చేయవచ్చు. గ్రహదోషాలు తొలగేందుకు రాహుకేతు పూజలు చేయవచ్చు. శ్రీవేంకటేశ్వరునికి ముడుపులు కట్టవచ్చు. ఐశ్వర్యాలు అనుగ్రహించమని దుర్గమ్మకు గాజులు అలంకరించవచ్చు.  ఇలా ఒకటేమిటి ఇలాంటి ఎన్నో పూజలు ఈ ఏడాది కోటిదీపోత్సవ ప్రత్యేకం. 

పరిణయం.. బ్రహ్మోత్సవం
దేవతల కల్యాణాన్ని చేయించినా.. వీక్షించినా మహాపుణ్యప్రదమని అంటారు. ఈ రెండు అదృష్టాలు భక్తిటీవీ కోటిదీపోత్సవంలో కలుగుతాయి. ఈ వేడుకలో పాల్గొనే భక్తులందరి చేత స్వయంగా సంకల్పం చెప్పించి.. కనులపండువగా సకల దేవతల కల్యాణోత్సవాలు చేయిస్తారు. ఈ ఏడాది తిరుమల, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, శ్రీకాళహస్తి, వేములవాడ, యాదాద్రి, కాణిపాకం, అన్నవరం, సింహాచలం, ద్వారకాతిరుమల, ఒంటిమిట్ట, మధురై తదితర క్షేత్రాల నుంచి    3 వేంచేసిన ఉత్సవమూర్తులకు కనులపండువగా కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణ ప్రసాదం కూడా అందించడం కోటిదీపోత్సవ ప్రత్యేకత. కల్యాణోత్సవ మూర్తులు వివిధ వాహనాలను అధిష్టించి ప్రాంగణంలో ఊరేగుతుంటే ఆ వేడుకను వీక్షించే భక్తులు తన్మయులవుతారు. సకల దేవతలకూ ఒకే ప్రాంగణంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే చూసే భక్తులకు అంతకుమించిన మహద్భాగ్యం ఇంకేముంటుంది. 

అనిర్వచనీయం.. అత్యద్భుతం
ఉత్సవంలో అన్నింటికీమించిన ప్రధాన ఘట్టం దీపారాధన. ప్రధాన వేదికపై పీఠాధిపతులు, అతిరథమహారథుల సమక్షంలో తొలి దీపారాధన జరిగిన వెంటనే.. కైలాస ప్రాంగణమంతా కాంతులీనుతుంది. అప్పటిదాకా విద్యుత్ దీపాల వెలుగులతో ఉన్న ప్రాంగణం నిజమైన దీపకాంతులతో మెరిసిపోతుంది. దివిపై నుంచి చూస్తే నేలపై వజ్రాలు, పగడాలు కలగలిపి ఆరబోసినట్లుగా ఉంటుందా దృశ్యం. దీపారాధన చేసే భక్తుల్లో ఒకటే అనుభూతి. కోటి దీపోత్సవ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం తమ పూర్వజన్మ సుకృతమని. కోటిదీప కాంతుల నడుమ జరిగే లింగోద్భవం ఓ అపూర్వ ఘట్టం. సదాశివునికి అర్పించే సప్తహారతులు మరో అద్భుతం. బిల్వ, నంది, సింహ, నాగ, రుద్ర, కుంభ, నక్షత్ర హారతులు ఇచ్చే సమయంలో కైలాస ప్రాంగణంలో ఓంకారంతో మార్మోగుతుంది. ప్రాంగణంలోని భారీ శివలింగానికి నిర్వహించే మహానీరాజనం మరో ఎత్తు. ప్రమథ గణాలు తరలివచ్చి మహాదేవునికి మహానీరాజనం చేస్తున్నారా అనేంతలా ఉంటుందా అద్భుత దృశ్యం. ఇలాంటి అనేక ఘట్టాలను వీక్షించే భక్తులకు శివుడు ఎక్కడో కాదు.. ఈ కోటిదీపోత్సవ ప్రాంగణంలోనే ఉన్నాడని అనిపించక మానదు. 

నటరాజుకు కళాంజలి
తాండవప్రియుడైన శివునికి కళానీరాజనం అర్పించే  మహాద్భుత ఉత్సవమిది. అందెల రవళులు ఘల్లుఘల్లుమంటాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్యాలకే కాదు.. జానపద కళలకు సైతం కోటిదీపోత్సవం పెద్దపీట వేస్తుంది. కథకళి, ఒడిస్సీ, మణిపురి వంటి సంప్రదాయ నృత్యాలతో పాటు.. డోలుకుణిత, భాంగ్రా, కోలాటం వంటి అనేకానేక విభిన్న పదనర్తనలు కోటి దీపోత్సవ వేదికపై కదం తొక్కనున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement