సాక్షి, తాండూరు : కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర టీఆర్ఎస్ పార్టీకి, ఆ ప్రభుత్వానికి అంతిమ యాత్రలా మారుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క మల్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్రను చూసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయంతో వణుకుతున్నారని అన్నారు. ప్రజా చైతన్య యాత్ర సందర్భంగా తాండూరులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రజా చైతన్య యాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే టీఆర్ఎస్ పీఠాలు కదలిపోవడం ఖాయమన్న విషయమం స్పష్టమవుతోందని అన్నారు. 2019 ఎన్నికల్లో దొరస్వామ్య, పెత్తందారీ టీఆర్ఎస్ పాలనకు ప్రజలు సమాధికట్టి, ప్రజలకోసం, ప్రజల కొరకు, ప్రజాస్వామ్య యుతంగా పాలించే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారన్న విషయం అర్థమవుతోందని అన్నారు.
కేసీఆర్ పాలన అత్యంత క్రూరంగా, దుర్మార్గంగా ఉందని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణకు తలమానికం అయిన సిగరేణి కాలరీస్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకర సంకేతాలను పంపేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు. నిజాం కాలంలో, బ్రిటీష్ పాలనలో సింగరేణికి అధికారింగా ఏనాడు సెలవు ఇవ్వలేదు. అదేవిధంగా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మరణించిన సమయంలో కూడా సింగరేణికి సెలవు ఇవ్వలేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాంటిది ఈరోజు కేవలం సీఎం కేసీఆర్ సభ కోసం సింగరేణి ఒక్క రోజు సెలవు ఇవ్వడం ఏమిటని భట్టి తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఈ చర్య వల్ల సింగరేణికి ఒక్క రోజు ఉత్పత్తి ఆగిపోయి రాష్ట్ర ఖజనాకు నష్టం కలుగుతుంని ఆయన చెప్పారు. ఖజానాకు నష్టం వచ్చినా తన సభకు ఆహుతులు కావాలని కార్మికులనే సభికులుగా కేసీఆర్ మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారని భట్టి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పోరాడి సాధించుకున్న తెలంగాణలో రైతులు, విద్యార్థులు, మహిళలు, బీసీలు, ఎస్పీలు, ఎస్టీలు తీవ్రంగా నష్టపోతున్నారని భ్టటి ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమల్లోకి తీసుకువచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల జనాభాలోని దామాషా పద్దతిలో ఎస్సీలకు, ఎస్టీలకు నిధులు కేటాయింపు జరగాలని ఆయన చెప్పారు. ఈ చట్టం వల్ల ఈ నాలుగేళ్లలో ఎస్టీలకు, ఎస్టీలకు 50 నుంచి 60వేల కోట్ల నిధుల మంజూరు జరగాలని ఆయన అన్నారు. అయితే కేసీఆర్ పాలనతో దళితులు, గిరిజనులకు ద్రోహం జరిగిందనడానికి ఇదే పెద్ద నిదర్శనం అని అన్నారు.
ఇటువంటి దిక్కుమాలిన ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో సమాధి కట్టాలని భట్టి విక్రమార్క ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వస్తే ప్రతినియోజక వర్గంలోనూ లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చాడని, ఇచ్చిన హామీ మేరకు తాండూర్ నియోజకవర్గంలో ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాడో చెప్పాలని ఆయన తీవ్ర స్వరంతో కేసీఆర్‌ని ప్రశ్నించారు. వెనుకబడిన రంగారెడ్డి జిల్లాకు నీళ్లు ఇచ్చే ఉద్ధేశంతో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టింది. ఆ నీళ్లు ఎక్కడ పారితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుందన్న భయంతోనే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో హత్య చేశారని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ అనేది కేవలం ఒక అబద్దపు ప్రచారంలా మిగిలిపోయిందని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతురుణ మాఫీకింద ఇప్పటివరకూ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కేవలం వడ్డీకే సరిపోలేదని భట్టి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment