భువనగిరి :ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భువనగిరి ఖిలాను పర్యాటక కేంద్రంగా త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ వెల్లడించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రి స్థానిక ఖిలా వద్ద జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి, యాదగిరిగుట్ట, కొలనుపాకలను కలుపుతూ పర్యాటక సర్కిల్‌గా తీర్చిదిద్దడానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. భువనగిరి ఖిలాను అభివృద్ధి చేయడంలో భాగంగా ముందుగా రోప్‌వే నిర్మాణంతోపాటు ఖిలాపై పలు అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
ఈ ప్రాంతం హైదరాబాద్‌కు చేరువలో ఉన్నందున పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రోజూ వెయ్యిమంది పర్యాటకులు వస్తారని చె ప్పారు. భువనగిరి డివిజన్‌లో పర్యాటక రంగం అభివృద్ధికి కలెక్టర్ చిరంజీవులు ప్రత్యేక చొరవ చూపాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ చిరంజీవులు మాట్లాడుతూ పర్యాటక రంగం అభివృద్ధి చెందితే ఉపాధి, ఉద్యోగ అవకాశాలతోపాటు ఆదాయం పెరుగుతుందన్నారు. మన దేశ జాతీయాదాయంలో 7 శాతం పర్యాటక రంగం నుంచి వస్తుందన్నారు. వచ్చే పర్యాటక దినోత్సవం నాటికి రోప్‌వే పూర్తవుతుందన్నారు. ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా స్థానికులకు ఆదాయం పెరుగుతుందని చెప్పా రు. ఆర్డీఓ నూతి మధుసూదన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సుర్వి లావణ్య, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ కె.వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు వేముల భాగ్యవతి, ఎండీ నా సర్, పడమటి జగన్మోహన్‌రెడ్డి, పీఎస్. మంజుల, లతాశ్రీ ఉన్నారు. కాగా విద్యార్థులకు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.
పర్యాటక కేంద్రంగా భువనగిరి
Published Sun, Sep 28 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM
Advertisement