పర్యాటకుల స్వర్గధామం వంజంగి హిల్స్
పొగమంచు అందాలకు పర్యాటకులు పిధా
సీజన్ కావడంతో పోటెత్తుతున్న పర్యాటకులు
మబ్బులకు పైనుండే గిరి శిఖరాలు, కొండల నడుమ పాలనురగలా తేలియాడే మంచు మేఘాలు, పొద్దు పొడుస్తూనే భానుడు పొన్నపూవు ఛాయలో అలా..అలా.. పైకివస్తూంటే, మబ్బుల అలల మధ్య నిల్చొని ఊషోదయ భానుని అందాలు తనివితీరా ఆస్వాదిస్తుంటే.. ఆ అనుభూతి వర్ణణాతీతం. చెట్ల ఆకులపైన తుషార బింధువులు సూర్యుని లేలేత కిరణాలుపడి మెరిసిపోతుంటే, ఆమెరుపు పర్యాటకుల ముఖంలో ప్రతిబింబిస్తుంది. మన్యం రుచులు, మంచు అందాలతో వంజంగి పర్యాటకులకు మధురానుభూతులు పంచుతోంది.
సాక్షి,పాడేరు: అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలోని వంజంగిహిల్స్ పర్యాటక కేంద్రంగా మంచి గుర్తింపు పొందింది. గత నాలుగేళ్లుగా వంజంగి శిఖరాలకు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఎత్తయిన వంజంగి కొండల మీదుగా కొత్తవలస ప్రాంతానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తారురోడ్డు సౌకర్యం కలి్పంచడంతో పర్యాటకులకు మరింత అనుకూలతగా మారింది. అక్టోబర్ నుంచి జనవరి నెల వరకు ప్రతి ఏడాది వంజంగి హిల్స్ ప్రాంతానికి తండోప తండాలుగా పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం పర్యాటక సీజన్ కావడంతో వంజంగి హిల్స్‌లోని ప్రకృతి అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగానే తరలివస్తున్నారు..
వంజంగి హిల్స్‌లో ప్రకృతి అద్భుతం
శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఈ వంజంగి కొండలపై మంచు ,మేఘాల అందాలు చూపరులను మరింత కనువిందు చేస్తున్నాయి. వంజంగి ఘాట్ ప్రాంతం నుంచి దిగువన ఉన్న కొండలన్ని మంచు ముసుగులో అద్భుతంగా కనిపించడంతో పాటు అక్కడ నుంచి రెండు గంటల పాటు కాలినడకన ఎత్తయిన బోలెంగమ్మ పర్వతానికి చేరుకుంటే సూర్యోదయం అందాలు, పాలసముద్రంలా మేఘాలు,పొగమంచు అందాలతో పర్యాటకులు పిధా అవుతున్నారు. బోలెంగమ్మ పర్వతానికి తెల్లారకముందే పర్యాటకులు చేరుకుంటున్నారు. సూర్యోదయం అయ్యే సమయంలో ఇక్కడ రమణీయ దృశ్యాలు వారిని మరింత అబ్బుర పరుస్తున్నాయి. వంజంగి హిల్స్ ప్రాంతం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. గూగుల్‌లో ఈ పర్యాటక ప్రదేశం గురించి సెర్చ్ చేసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.
పర్యాటక స్వర్గం
వంజంగి హిల్స్‌తో పాటు సముద్ర మట్టానికి సుమారు 3000 అడుగుల ఎత్తున ఉన్న బోలెంగమ్మ పర్వత శిఖరం అద్భుత పర్యాటక కేంద్రంగా మారింది. దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. వణికించే చలిని సైతం లెక్కచేయకుండా రాత్రంతా వంజంగి హిల్స్ సమీపంలోని కాటేజీలు, గుడారాల్లో మకాం వేసి సూర్యోదయం అవకముందే బోలెంగమ్మ పర్వతానికి కాలినడకన చేరుకుంటున్నారు. వంజంగి ఘాట్‌తో పాటు బోలెంగమ్మ శిఖరం వరకు ఇక్కడ మంచు అందాలు పాలసముద్రంలా పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.
వంజంగి హిల్స్ అందాలు అద్భుతం
వంజంగి హిల్స్‌కు వచ్చే పర్యాటకులకు వసతి సౌకర్యాలను కలి్పంచేందుకు ఐటీడీఏ చర్యలు తీసుకుంది.వంజంగి హిల్స్‌కు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసాం.పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పలుశాఖల అ«ధికారులను అప్రమత్తం చేసాం.వంజంగి హిల్స్‌లో పర్యాటక అభివృద్ధి,గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లక్ష్యంగా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.
– వి.అభిõÙక్, ఐటీడీఏ పీవో, పాడేరు.
కాటేజీలు నిరి్మస్తే బాగుంటుంది
వంజంగి హిల్స్‌లో సూర్యోదయం, పాలసముద్రం లాంటి మేఘాలు, పొగమంచు అందాలు అద్భుతంగా ఉన్నాయి. గంటన్నర సమయం నడిచి వంజంగి హిల్స్‌పై సూర్యోదయంతో పాటు మంచు అందాలను వీక్షించడం సంతోషంగా ఉంది.వంజంగి హిల్స్‌లోనే కాటేజీలు నిర్మిస్తే పర్యాటకులకు మరింత మేలు జరుగుతుంది.వంజంగి నుంచి అరకులోయ ప్రాంతం వరకు రోడ్లు అభివృద్ధితో పర్యాటకుల వాహనాల ప్రయాణానికి ఇబ్బందులు తప్పాయి. – కనకల ఈశ్వరరావు, పర్యాటకుడు,విశాఖపట్నం
Comments
Please login to add a commentAdd a comment