బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ? | bibinagar railway junction | Sakshi
Sakshi News home page

బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ?

Published Sun, Jun 15 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:48 AM

బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ?

బీబీనగర్ జంక్షన్ అయ్యేనా ?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం వేసిన మొదటి రైల్వేలైన్ నడికుడి-బీబీనగర్. నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1977లో ఈ రైల్వేలైన్‌ను ప్రారంభించారు. ఈ మార్గం ద్వారా తెలంగాణ, సీమాంధ్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు రవాణాను సులభతరం చేశారు. నిత్యం గూడ్స్, ప్యాసిం జర్లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణమధ్య రైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్‌కు కూతవేటు దూరంలో ఉన్న నడికుడి రైల్వేలైన్ ఏర్పా టు సమయంలోనే బీబీనగర్‌లో జంక్షన్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేకు అనుబంధంగా బీబీనగర్, పగిడిపల్లి, బొమ్మాయిపల్లి, నాగిరెడ్డిపల్లి రైల్వేస్టేషన్ వరకు రైలులైన్లను విస్తరించి జంక్షన్ ఏర్పాటు చేయాలని భావించారు. కానీ 40ఏళ్ల క్రితం చేసిన ప్రతిపాదనను పాలకులు ఏనాడో మరిచిపోయారు. బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతం రైల్వే జంక్షన్‌గా రూపాంతరం చెందితే ఈ ప్రాంత నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు పొందే అవకాశాలు ఉండేవి.
 
 రైల్వే వ్యాపార కేంద్రంగా బీబీనగర్
 రైల్వే ద్వారా బీబీనగర్ పారిశ్రామిక ప్రాంతాల్లోని పరిశ్రమలకు ముడి సరుకుల రవాణా సౌకర్యాలు మెరుగయ్యాయి. హిందుస్థాన్, బాంబీనో, ఐషర్ ట్రాక్టర్స్ వంటి పలు కంపెనీలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశాయి. బీబీనగర్ ప్రధాన కేంద్రంగా కంకర రవాణా జరుగుతుంది. గుట్టల ప్రాంతంగా ఉన్న భువనగిరి డివిజన్‌లో వెలసిన క్రషర్‌ల ద్వారా 40ఎంఎం కంకర రైల్వే పట్టాల కింద వేయడానికి వినియోగించుకుంచారు. ఈ కంకరను దక్షిణమధ్య రైల్వే పరిధిలోని బల్లార్ష, కొండపల్లి, మహబూబ్‌నగర్, షెడామ్, వికారాబాద్, శంకర్‌పల్లి, విజయవాడ, వరంగల్ ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు
 .
 సికింద్రాబాద్‌పై తగ్గనున్న వత్తిడి
 బీబీనగర్ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేస్తే దక్షిణ మధ్యరైల్వే ప్రధాన స్టేషనైన సికింద్రాబాద్‌పై వత్తిడి తగ్గనుంది. పలు రైళ్లు సికింద్రాబాద్‌నుంచి ప్రారంభమై ఇక్కడే ఆగిపోతుంటాయి. బీబీనగర్‌ను జంక్షన్ చేయడం వల్ల పలు రైళ్లను ఇక్కడినుంచి ప్రారంభించే అవకాశం ఉంటుంది. నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
 
 బీబీనగర్‌లో దిగిపోతున్న ప్రయాణికులు
 సికింద్రాబాద్ -ఖాజీపేట మార్గంలో భువ నగిరిలో ఇప్పటికే రైల్వే స్టేషన్ ఉంది. అ యితే భువనగిరి శివారు గుండా నడికుడి మార్గం ఉన్నా.. ఇక్కడ స్టేషన్ లేక రైళ్లు ఆగడం లేదు. దీంతో సికింద్రాబాద్ నుంచి వచ్చే వారు బీబీనగర్‌లో, నల్లగొండ నుంచి వచ్చే వారు నాగిరెడ్డిపల్లిలో దిగి 11కిలోమీటర్లు బస్‌లో ప్రయాణించి భువనగిరికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ మార్గంలో రైల్వేస్టేషన్ నూతనంగా ఏర్పాటు చేస్తే భువనగిరి డివిజన్ ప్రాంత ప్రయాణికులతో పాటు జిల్లా ప్రయాణికులకు మేలు చేసినట్లవుతుంది.
 
 భువనగిరి-2 రైల్వేస్టేషన్ ఏర్పాటుకు వినతి
 పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన భువ నగిరి పట్టణానికి అనుసంధానంగా బీబీనగర్-నడికుడి మార్గంలో భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు ఎంతో కాలంగా కోరుతున్నారు. బీబీనగర్ పగిడిపల్లి, ముగ్దుంపల్లి తర్వాత భువనగిరి రెవెన్యూ గుండా వెళ్లే రైల్వేలైన్ అనాజీపురం మీదుగా నాగిరెడ్డిపల్లి వరకు ఉంది. ఈ మధ్యలో ఎక్కడా రైల్వేస్టేషన్ లేదు. దీంతో ఈ ప్రాంత ప్రజలు రైల్వే ప్రయాణం  చేయాలంటే సికింద్రాబాద్‌కు వెళ్లాల్సి వస్తుంది. భువనగిరి ప్రయాణికులు సమారు 80కిలో మీటర్లు అప్ అండ్ డౌన్ అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. తిరుపతి, చెన్నై, తివేండ్రం, కోయంబత్తూర్ ఇలా పలు దక్షిణాది రాష్ట్రాలకు ఈ మార్గం గుండా రైళ్లు వెళ్తుంటాయి. నారాయణాద్రి, నర్సాపూర్ సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్‌లు మిర్యాలగూడ డెమూ, డెల్టాప్యాసింజర్, రేపల్లే ప్యాసింజర్‌లు వెళ్తున్నాయి. ఇవి కాకుండా బీబీనగర్‌లో ఆగకుండా పల్నాడు, విశాఖ, ఫలక్‌నుమా, శబరి, జన్మభూమి, వారాకోసారి డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళ్తాన్నాయి. భువనగిరి-2 రైల్వే స్టేషన్ ఉంటే ఈ రైళ్లలో ఎక్కువ భాగం ఆగే అవకాశం ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement