- స్థలాల లభ్యతపై సమాచారం కోరిన ప్రభుత్వం
- జీఓ ఆంక్షలకు లోబడి అభివృద్ధికి నిర్ణయం
- అమ్యూజ్‌మెంట్ పార్కులు, గోల్ఫ్‌కోర్టులు..
- సర్కారు భూముల లెక్కతీసిన యంత్రాంగం
- 111 సవరణ కష్టమని తేలడంతోనే ఈ నిర్ణయం
111 జీఓ పరిధి ప్రాంతాలు: మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాల పరిధిలోని 82 గ్రామాలు.
నిబంధనలు : ఈ జీఓ ప్రకారం 84 గ్రామాల పరిధిలో కొత్తగా చేసే లే అవుట్‌లలో రోడ్లతో కలుపుకొని 60 శాతం ఖాళీ స్థలం వదలాలి. ఈ ప్రాంతం భూ వినియోగంలో 90% పరిర క్షణ ప్రాంతంగా నిర్దేశించింది. కేవలం రిక్రియేషన్, ఉద్యాన, పూల తోటల పెంపకాలకే భూమిని ఉపయోగించాలి. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చుట్టూ 10 కి.మీ పరిధిలో కాలుష్య ఉద్గారాలు వెదజల్లే పరిశ్రమలు అనుమతించకూడదు.
ప్రస్తుత చర్యలు: జీఓ ఆంక్షలకు లోబడి గోల్ఫ్‌కోర్టులు, రిక్రియేషన్, డిస్నీలాండ్ తరహా అమ్యూజ్‌మెంట్ పార్కుల స్థాపనకు చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జీవ సంరక్షణ మండలి (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలో ఉన్న భూములపై ప్రభుత్వం కన్నేసింది. నగరానికి చేరువలో ఉన్న సర్కారు భూములను వినియోగంలోకి తీసుకురావడంపై దృష్టి సారించింది. రాజధాని దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈ జ లాశయాలకు చుట్టూరా 10 కిలోమీటర్ల పరిధిలో నిర్మాణాలు, పరిశ్రమల స్థాపనపై ఆంక్షలు విధిస్తూ 1996లో అప్పటి ప్రభుత్వం 111 జీఓను జారీ చేసింది. పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు సులువుగా జలాశయాలకు చేరేలా, కాలుష్య జలాలను నివారించేలా ఈ జీఓ దోహదపడుతుందని భావించింది. మొయినాబాద్, శంషాబాద్, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, షాబాద్ మండలాల పరిధిలోని 82 గ్రామాలకు 111 జీఓ ఆంక్షలు వర్తిస్తున్నాయి. దీంతో ఆయా మండలాల్లో అభివృద్ధికి బ్రేక్ పడింది. మరోవైపు కొందరు ప్రభుత్వ పెద్దలు, బడా బాబులు మాత్రం యథేచ్ఛగా పరిశ్రమలు, కాలేజీలు, ఫాంహౌస్‌లు స్థాపించి నిబంధనలకు తూట్లు పొడిచారు. తమ ప్రగతికి నిరోధకంగా మారి న జీఓను ఎత్తివేయాలని స్థానికులు ఉద్యమం చేయడంతో జీఓ ఎత్తివేత దిశగా ప్రభుత్వం చేసిన యత్నాలకు సామాజిక, పర్యావరణ వేత్తల నుంచి అభ్యం తరం వ్యక్తమైంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా జీఓ సవరణను అడ్డుకున్నారు.
కేసీఆర్ సర్కారు కూడా..
అధికారంలోకి వస్తే 111 జీఓను ఎత్తివే స్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగానే జీఓను సమీక్షించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని జిల్లా యంత్రాం గాన్ని ఆదేశించారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో సర్వే చేసిన నీటిపారుదలశాఖ జీఓ అమలు తప్పనిసరని తేల్చిచెప్పింది. ఈ జీఓ రద్దుతో జంట జలాశయాల అస్తిత్వానికి ముప్పు ఏర్పడుతుందని తేల్చిచెప్పింది. జీఓ జారీలో శాస్త్రీయత పాటించలేదని, ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వచ్చే శంకర్‌పల్లిలోని నాలుగు గ్రామాలను ఉద్దేశపూర్వకంగా 111 నుంచి తప్పించినట్లు గుర్తించింది. 1908లో హైదరాబాద్‌ను ముంచెత్తిన మూసీ వరదల నేపథ్యంలో మూసీ బేసిన్‌లో ఈ చెరువుల నిర్మాణాన్ని చేపట్టారని, ఈ అంశాన్ని గమనంలోకి తీసుకోవాల్సివుంటుందని పేర్కొంది. జంట జలాశయాల భంగం వాటిల్లకూడదనే పర్యావరణవేత్తల సూచనలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని స్పష్టం చేసింది. ఇరిగేషన్ నిపుణుల అభిప్రాయంతో ఇరకాటంలో పడిన సర్కారు.. జీఓ జోలికి వెళ్లకపోవడమే మంచిదనే భావనకు వచ్చింది.
ఆంక్షలకు లోబడి అభివృద్ధి
నగరానికి సమీపంలో 111జీఓ పరిధిలోని సర్కారు భూములను వినియోగంలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీఓ నిబంధనలకు లోబడి భూములను అభివృద్ధి చేసే అంశంపై ఇటీవల ఉన్నతస్థాయి సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో జీఓ పరిధిలోని ఆరు మండలాల్లోని సర్కారు భూముల లభ్యతపై సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం సేకరించింది. గ్రేటర్‌కు సమీపంలో ఉన్నందున.. ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, వీటిలో 111 జీఓ ఆంక్షలకు లోబడి నిర్మాణాలు, పరిశ్రమలకుగాకుండా గోల్ఫ్‌కోర్టులు, రిక్రియేషన్, డిస్నీలాండ్ తరహా అమ్యూజ్‌మెంట్ పార్కులు, స్థాపనకు ద్వారాలు తెరవాలని నిర్దేశించింది. దీంతో జిల్లా యంత్రాంగం 111 జీఓ పరిధిలో ఉన్న 31,195.6 ఎకరాల సర్కారు భూముల్లో ఎన్ని అనుకూలంగా ఉన్నాయనే అంశంపై కసరత్తు ప్రారంభించింది.
111 జీఓ పరిధిపై కన్ను!
Published Thu, May 21 2015 12:15 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement