టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌ | Biometrics in JNTU Hyderabad | Sakshi
Sakshi News home page

టెక్నికల్‌ కళాశాలల్లో బయోమెట్రిక్‌

Published Thu, Oct 3 2019 12:28 PM | Last Updated on Thu, Oct 3 2019 12:40 PM

Biometrics in JNTU Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ (హైదరాబాద్‌)పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని అమలు చేయాలని వర్సిటీ భావిస్తోంది. ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలని గతంలోనే అన్ని యూనివర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఎంటెక్, ఎంఈ, ఎం–ఫార్మసీ వంటి పీజీ కోర్సులకు అధ్యాపకులతో పాటు విద్యార్థులకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేస్తుండగా, అదే తరహాలో బీటెక్, బీఈ, బీ–ఫార్మసీ కోర్సుల్లోనూ అమలు చేసేందుకు జేఎన్‌టీయూహెచ్‌ సిద్ధమవుతోంది. అయితే, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో యంత్రాలు సమకూర్చుకోవడం ఇబ్బందిగా మారుతుందని గతంలో ఈ  నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీని అనుకూలంగా తీసుకున్న కొన్ని కళాశాలలు విద్యార్థులు తరగతులకు సరిగా హాజరు కాకున్నా కాలేజీకి వస్తున్నట్టుగానే చూపుతున్నారు. దీనికి చెక్‌ పెట్టాలంటే బయోమెట్రిక్‌ విధానం తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని జేఎన్‌టీయూహెచ్‌ నిర్ణయించింది. దీంతో త్వరలో యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో బయోమెట్రిక్‌ విధానం త్వరలో అమల్లోకి రానుంది. 

ఒక్కో యంత్రంలో 100 మంది
ఇంజినీరింగ్, ఫార్మసీ విద్యార్థులు, అధ్యాపకులకు బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కావడంతో చాలా కళాశాలలు వెనుకడుగు వేస్తున్నాయి. ఒక యంత్రం నిర్వాహణకు నెలకు రూ.800 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు వాపోతున్నాయి. దీనివల్ల కళాశాలలపై ఆర్థిక భారం పడుతుందంటున్నారు. జేఎన్‌టీయూహెచ్‌ అనుబంధ ఇంజినీరింగ్‌ కళాశాలలు 160, బీఫార్మసీ కళాశాలు మరో 70 ఉన్నాయి. వీటి పరిధిలో 2.70 లక్షల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఒక్కో యంత్రంలో 100 మంది హాజరు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి 2500కు పైగా బయోమెట్రిక్‌ యంత్రాలను సమకూర్చుకోవాలి. దీనికోసం జేఎన్‌టీయూహెచ్‌ తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ సహాయం తీసుకోనున్నట్లు సమాచారం.  

పర్యవేక్షణ మరింత సులువు
విద్యార్థుల హాజరు వివరాలు జేఎన్‌టీయూహెచ్, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈ–పాస్‌ విధానానికి అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా బయోమెట్రిక్‌ హాజరు ద్వారా కళాశాల ప్రిన్సిపల్‌తో పాటు జేఎన్‌టీయూ, ఉన్నత విద్యామండలి అధికారుల వరకు ఆన్‌లైన్‌లో అధ్యాపకులు, విద్యార్థుల హాజరును సులువుగా పర్యవేక్షించగలరు. డాష్‌బోర్డ్‌ ద్వారా ఎప్పటికప్పుడు ఆయా కళాశాలల్లో నమోదవుతున్న హాజరు తెలుసుకోవచ్చు. యూనివర్సిటీ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు కళాశాలలను సందర్శించకుండానే ఏ రోజుకారోజు అక్కడి హాజరు పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుంది.  

ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌ పొందాలంటే ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి. కానీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో చేరుతున్న చాలామంది విద్యార్థులు తరగతులకు సరిగ్గా హాజరు కావడం లేదు. స్కాలర్‌షిప్‌కు 75 శాతంగా చూపించేందుకు విద్యార్థులు అయాకళాశాలలు డిమాండ్‌ చేసిన డబ్బును మట్టుజెపుతున్నారు. ఇలా హాజరు శాతం సరిచేయటానికి ఒక్కో విద్యార్థి నుంచి రూ.4 వేలనుంచి రూ.5 వేలకు పైగా(అవసరాన్ని బట్టి) వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బయోమెట్రిక్‌ విధానం అమల్లోకి వస్తేప్రైవేటు కళాశాలల దోపిడీకి అడ్డుకట్ట పడుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement