కమలంలో నైరాశ్యం | BJP Decrease In District vikarabad | Sakshi
Sakshi News home page

కమలంలో నైరాశ్యం

Published Tue, Mar 19 2019 5:06 PM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

BJP Decrease In District vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌: కేంద్రంలో అధికారంలోకి రావాలని, మోదీని మరోమారు ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాలని భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో ముమ్మర ప్రచారం చేస్తోంది. మెజార్టీ ఎంపీ సీట్లు సాధించేలా వ్యూహరచన చేస్తోంది. ఇందుకు అనుగుణంగా ఎంపీ అభ్యర్థులను ఎంపిక చేయటంతో పాటు కేడర్‌లోనూ జోష్‌ నింపుతోంది. అయితే రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్సాహం కనిపించడం లేదు. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో కమలం పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని చెప్పవచ్చు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ప్రతికూల ఫలితాలే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు లోక్‌సభ ఎన్నికలపై పార్టీ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం, అభ్యర్థుల ప్రకటనలో జాప్యం చేస్తుండటం నాయకులు, కార్యకర్తలను అసంతృప్తికి గురిచేస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ వ్యవహారశైలితో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారు. కేంద్రంలో పాలనా పగ్గాలు చేపట్టాలని చూస్తున్న నేతలు.. ఇప్పటికే ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తే పార్టీకి లాభం చేకూరేదని జిల్లాకు చెందిన బీజేపీ నేత ఒకరు అభిప్రాయపడ్డారు.  


ద్వితీయ శ్రేణి నేతల అసహనం  


చేవెళ్ల పార్లమెంట్‌ స్థానానికి బలమైన అభ్యర్థి ని బరిలో దింపాలని ఆపార్టీకి చెందిన జిల్లా నాయకులు భావిస్తున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థి విషయంలో స్పష్టత ఇవ్వటంలేదు. అధిష్టానం వ్యవహార శైలివల్లే ఎన్నికల్లో పార్టీ ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తోందని ద్వితీయ శ్రేణి నేతలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును గుర్తు చేసుకుంటున్నారు. పరిగి అసెంబ్లీకి సంబంధించి ఆ పార్టీ ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాదరావు టికెట్‌ ఆశించారు.

అయితే చివరి నిమిషం వరకు బీజేపీ అధిష్టానం ఆయన పేరును ప్రకటించలేదు. దీం తో మనస్తాపానికి గురైన ఆయన పార్టీ వీడతానని ప్రకటించటంతో ఎట్టకేలకు తనను అభ్యర్థిగా ప్రకటించింది. పరిగిలో పార్టీ బలంగానే ఉన్నా.. ఎన్నికల ప్రచారానికి అనుకున్నంత సమయం దక్కకపోవటంతో ప్రహ్లాదరావుకు ఓటమి తప్పలేదు. తాండూరు నియోజకవర్గానికి సంబంధించి సీనియర్‌ నాయకుడు రమేశ్‌ తనకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వాలని కోరుతూ వచ్చారు.అసెంబ్లీ టికెట్‌ను సీ నియర్‌ నేత రమేశ్‌ కోరుతూ వచ్చారు.అయితే అ ధిష్టానం ఎన్‌ఆర్‌ఐ పటేల్‌ రవిశంకర్‌కు టికెట్‌ కట్టబెట్టింది. అధిష్టానం నిర్ణయం ఓవర్గం బీజేపీ నా యకులను అసంతృప్తికి గురిచేసింది. ఫలితంగా తాండూరులో యోగి అదిత్యనాథ్‌ ఇతర ము ఖ్యనేతలు ప్రచారం చేసినా బీజేపీ ఓటమిపాలైంది.  


కలిసిరాని ఫలితాలు.. 


పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఫలితాలు కలిసిరాలేదు. చేవెళ్ల పార్లమెంట్‌కు రెండుసార్లు ఉన్నికలు జరిగాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ నుంచి సీనియర్‌ నేత బద్దం బాల్‌రెడ్డి పోటీ చేశారు. ఈయన గెలుస్తారని భావించినా కేవలం 1,12,417 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2014లో బీజేపీ, టీడీపీ పొత్తులో ఉమ్మడి అభ్యర్థిగా వీరేందర్‌గౌడ్‌ను బరిలో దించగా ఆయన ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో వీరేందర్‌గౌడ్‌కు 3, 53,203 ఓట్లు వచ్చాయి. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి ఏమాత్రం కలిసిరాలేదు.

వికారాబాద్, పరిగి, తాండూరులో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్‌లు దక్కలేదు. పరిగి బీజేపీ పార్టీ తరఫున ప్రహ్లాదరావు పోటీ చేయగా ఓటమి పాలయ్యారు. ఆయనకు 6,739 ఓట్లు వచ్చాయి. వికారాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థి సాయికృష్ణ పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు కేవలం 1,973 ఓట్లు వచ్చాయి. ఇక తాండూరు నియోజకవర్గం నుంచి పటేల్‌ రవిశంకర్‌ పోటీ చేయగా ఆయనకు 10,548 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటే రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఏమేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. 

జనార్దన్‌రెడ్డికే అవకాశం..?

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనైనా పార్టీ అధిష్టానం జిల్లా నేతల అభిప్రాయాలను పరిగణనలోకి  తీసుకుని వెంటనే ఎంపీ అభ్యర్థిని ప్రకటించాలని జిల్లా నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. అయితే బీజేపీ అధిష్టానం మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. చేవెళ్ల టికెట్‌ కోసం జనార్దన్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. అదేసమయంలో  మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి సైతం ఇక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. మరోవైపు రాజాసింగ్‌ పోటీ చేస్తే బాగుంటుందని కొంతమంది కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా బీజేపీ అధిష్టానం మాత్రం జనార్దన్‌రెడ్డికే టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి సికింద్రాబాద్‌ ఎంపీ టికెట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో జనార్దన్‌రెడ్డికి దాదాపు లైన్‌ క్లియర్‌ అయినట్లేనని సమాచారం. మంగళవారం లేదా బుధవారం బీజేపీ అధిష్టానం చేవెళ్ల ఎంపీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement