పార్టీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న డాక్టర్ లక్ష్మణ్
సాక్షి, సిద్దిపేట: వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట జిల్లాలో బీజేపీ జెండా ఎగరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల శివారులో పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి జిల్లా అధ్యక్షుడు నాయిని నరోత్తంరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన లక్ష్మణ్ మాట్లాడుతూ కార్యకర్తల నిజమైన కల భవనం నిర్మాణంతో తీరేది కాదని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తేనే తీరుతుందన్నారు.
ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతంలో బీజేపీ జెండా రెపరెపలాడుతోందని, సమీప భవిష్యత్తులోనూ తెలంగాణలో అధికారంలోకి వచ్చి కార్యకర్తల కలను సాకారం చేస్తామన్నారు. సిద్దిపేటలోనూ కాషాయ జెండా రెపరెపలాడాలని, దానికి కార్యకర్తలు పూనుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా గత ఆరేళ్లలో ఉజ్వల యోజన కింద 9 కోట్ల కనెక్షన్లు అందించారని అన్నారు. గత 60 ఏళ్లల్లో గత ప్రభుత్వాలు నిర్మించిన 6.5 మరుగుదొడ్ల నిర్మిస్తే ఈ ఆరేళ్లలో 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారని తెలిపారు. ఏ సిద్ధాంతాన్ని నమ్మి ఇన్ని రోజులుగా కార్యకర్తలు పనిచేస్తున్నారో ఆ సిద్ధాంతాలను ప్రజలు ఆచరించే రోజులు వచ్చినందుకు కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. యజ్ఞాలు యాగాలు చేయడంలో తనకు ఎవరూ సాటి రారు అనుకునే వారు రామమందిరం నిర్మాణం విషయంలో నోరు మెదపడం లేదని, కానీ దేశవ్యాప్తంగా అన్ని పార్టీల వారు, వర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రాష్ట్రంలో దేశంలో 6వ స్థానంలో ఉందని ఇది సిగ్గు చేటని అన్నారు.
ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏంటి...
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు చేసిన సమ్మెనే సకల జనుల సమ్మెగా రూపాంతరం చెందిందని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముఖ్య పాత్ర పోశించిన కార్మికులు చేసిన పాపం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులను పరిగణించాలని వారికి సమాన జీతాలు ఇవ్వాలని, ప్రభుత్వాల విధానాల వల్లనే ఆర్టీసీ అప్పుల్లో ఉందని విమర్శించిన కేసీఆర్ నేడు సీఎం హోదాలో ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. చినజీయర్ స్వామి చేత అక్షింతలు వేయించుకోవడం కేసీఆర్‌కు పరిపాటిగా మారిందని, అలాగే హైకోర్టు చేత అక్షింతలు వేయించుకోవడంలో తేడా లేదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసుల ఆంక్షలు, నిర్భందాలతో ఉద్యమాలను ఆపలేరని, వాటికి భయపడి ఉద్యమాలను ఆపేవారు బీజేపీ వారు కాదని అన్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘంకు గౌరవఅధ్యక్షులుగా వ్యవహరించిన హరీశ్‌రావు వారి సమస్యల పరిష్కారం కోసం ఎందుకు చొరవ చూపడం లేదని ప్రశ్నించారు. పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కోసం వేసిన పునాదితో సిద్దిపేటలో పార్టీ జెండా ఎగురవేసేందుకు పునాది పడినట్టు కార్యకర్తలు గుర్తించాలని వారికి భరోసానిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పాపారావు, కోశాధికారి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, రామచందర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు గంగాడి మోహన్‌రెడ్డి, బాలే ష్‌గౌడ్, శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దూది శ్రీకాంత్‌రెడ్డి, మహిళా మోర్చా జిల్లా అద్యక్షురాలు తోకల ఉమారాణి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment