
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మతం కోణంలో చూడకూడదని.. నిజాంకు వ్యతిరేకంగా మతాలకు అతీతంగా అందరూ పోరాటం చేశారని బీజేపీ తెలంగాణ విమోచన కమిటీ ఛైర్మన్ శ్రీవర్ధన్‌రెడ్డి అన్నారు. ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌లో రేపు (మంగళవారం) జరగనున్న తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రక ఘట్టాల ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. 17 సెప్టెంబర్ 1948 సంబంధించి పోరాట తెలంగాణ విమోచన పోరాట వీరుల చిత్రాల ప్రదర్శన జరుగుతుందన్నారు. హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్,మురళీధర్ రావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రజాస్వామ్య పోరాట యోధులకు ఘన నివాళర్పించి స్మరించుకోవడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వానికి అభ్యంతరం ఎందుకు..?
సెప్టెంబర్ 17ను తెలంగాణ రాష్ట్ర్ర ప్రభుత్వం అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. విమోచన దినోత్సవాన్ని మహారాష్ట్ర, కర్ణాటకలలో నిర్వహిస్తుంటే తెలంగాణలో చేసేందుకు అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీ కి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదా అని ప్రశ్నించారు. దేశం మొత్తానికి తెలంగాణ విమోచన దినోత్సవ చారిత్రక ఆవశ్యకత చెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలి..
విమోచన దినోత్సవాన్ని జరపకుండా..తెలంగాణ పోరాట అమరవీరులను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారన్నారు. తెలంగాణ విమోచన పోరాటంలో పల్లె పల్లెలో జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనలు ఎన్నో జరిగాయని..వేల మంది ఈ పోరాటంలో నేలకొరిగారని వివరించారు. ఈ బలిదానాలను శాశ్వతంగా గుర్తుంచుకునేందుకు అధికారికంగా విమోచన దినోత్సవాన్ని జరపాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన రాజకీయాల కోసం దేవాలయాలపైన తన ఫొటోలను వేయించుకోవడం శోచనీయం అన్నారు. ఇది హిందూ సంస్కృతిని అవమానించడమేనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment