
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించడానికి బీజేపీ కసరత్తు పూర్తిచేసింది. గురువారం ఢిల్లీలో కేంద్ర నాయకత్వం ఆమోదముద్ర వేసిన అనంతరం ఈ జాబితా విడుదల కానుంది. దసరా మరుసటి రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు అభ్యర్థులను ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం.. తాజాగా మరికొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. పోటీ తీవ్రంగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టి.. మిగతావాటిని వెల్లడించనుంది. షాద్‌నగర్, కల్వకుర్తి, ఎల్‌బీనగర్, తాండూరు, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్ నియోజకవర్గాలకు మొదటి జాబితాలో అభ్యర్థులను ఖరారు చేసింది. తాజాగా ఇబ్రహీంపట్నం, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కొడంగల్, రాజేంద్రనగర్ నియోజకవర్గాలను అభ్యర్థులను ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇందులో రాజేంద్రనగర్‌కు మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అయితే, స్థానిక నాయకులు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడి నుంచి ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన తోకలశ్రీశైలంరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా పార్టీ తీర్థం పుచ్చుకోనందున ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించలేనట్లు కనిపిస్తోంది. కూకట్‌పల్లికి మాధవరం కాంతారావు, శేరిలింగంపల్లికి పారిశ్రామికవేత్త యోగానంద్, కొడంగల్‌కు సీనియర్ నాయకుడు నాగురావు నామోజీ, ఇబ్రహీంపట్నంకు కొత్త ఆశోక్‌గౌడ్ పేరును రాష్ట్ర నాయకత్వం సిఫార్సు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జీ జేపీ నడ్డా నేతృత్వంలో భేటీ అయ్యే ఎన్నికల కమిటీలో వీరి అభ్యర్థిత్వాలపై తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఇదిలావుండగా, ఇతర పార్టీల నుంచి చేరికలుంటాయని సంకేతాలందిన నియోజకవర్గాల టికెట్లను పెండింగ్‌లో పెట్టాలని యోచిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment