
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. టికెట్ల కేటాయింపునకు సంబంధించి పార్టీ అధిష్టానం నియమించిన స్క్రీనింగ్ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా టీపీసీసీ నేతలతో సంప్రదింపులు జరిపింది. పార్టీ నిర్వహించిన సర్వేలు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌తో జరిపిన మంతనాలు, అభ్యర్థుల గెలుపోటములు, ప్రత్యర్థులకు దీటైన వ్యక్తులు, ఎన్నికల వ్యయాన్ని భరించే స్థోమత, రాజకీయంగా, ప్రజాప్రతినిధులుగా గత చరిత్ర తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అనుమతి తర్వాత నాలుగైదు రోజుల్లో జాబితా విడుదల చేయాలని నిర్ణయించినట్లు టీపీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
సాక్షి, వికారాబాద్: కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీచేసే వారి జాబితా తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. ఏఐసీసీ ముఖ్యనేత ఏకే.ఆంటోని నేత్వత్వంలోని సెలక్షన్ కమిటీ ఢిల్లీలో పలు దఫాలుగా చర్చించి దీనిపై ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహాకూటమి పొత్తుల ఖరారులో జాప్యం వల్ల ఏకాభిప్రాయం కుదిరిన సీట్లను సైతం వెల్లడించడంలో కాంగ్రెస్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. కాగా ఒకే అభ్యర్థి పోటీలో ఉన్నచోట ప్రచారం చేసుకోవచ్చునని ఢిల్లీ పెద్దలు సంకేతాలు ఇవ్వడంతో పరిగి, కొడంగల్‌లో తాజామాజీ ఎమ్మెలేలు ఇద్దరూ ప్రచారం చేస్తున్నారు.
కొడంగల్, పరిగిలో సిట్టింగ్‌లకే...
జిల్లాలో వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. కొడంగల్, పరిగిలో కాంగ్రెస్ తాజామాజీ ఎమ్మె ల్యేలు టి.రామ్మోహన్‌రెడ్డి, ఏ.రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కొడంగల్ నేత ఏ.రేవంత్‌రెడ్డికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, పరిగి కాంగ్రెస్ నాయకుడు టి.రామ్మోహన్‌రెడ్డికి ప్రచార కమిటీ సభ్యుడిగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వీరిరువురికి టికెట్లు దాదాపుగా ఖరారైనట్లే. అంతేకాకుండా అధికారికంగా అధిష్టానం అభ్యర్థులను ప్రకటించకున్నా.. తమ స్థానానికిఇబ్బంది ఉండదనే ధీమాతో ప్రచారం ముమ్మరం చేశారు. పరిగిలో ఎమ్మెల్యే టీఆర్‌ఆర్ ఇప్పటికే ఒకసారి నియోజకవర్గమంతా చుట్టివచ్చారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి మాత్రం చుట్టపుచూపులా వచ్చిపోతున్నారు.
వికారాబాద్‌లో పోటాపోటీ...
జిల్లా కేంద్రమైన వికారాబాద్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఏ.చంద్రశేఖర్ తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. ఇటీవల ఢిల్లీలో మకాం వేసి టికెట్ కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేశారు. స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో పాటు జాతీయ కాంగ్రెస్‌లో తమకు అనుకూలమైన నేతలను కలిసి టికెట్ ఇప్పించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ సైతం ఇంకా టికెట్ కేటాయించకపోవడంతో ప్రచారంలో రెండు పార్టీలు అంతంతమాత్రంగానే ఉన్నాయి.
తాండూరులో రోజుకో మలుపు...
జిల్లాలో వాణిజ్య, వ్యాపార పట్టణంగా పేరొందిన తాండూరులో కాంగ్రెస్ అభ్యర్థి విషయం రోజుకో మలుపు తిరుగుతోంది. గత ఏడాది కాలంగా కాంగ్రెస్ అభ్యర్థిగా చెప్పుకుంటున్న రమేష్‌మహారాజ్ అనారోగ్యం కారణాల చేత పోటీనుంచి తప్పుకుంటున్నట్లు సూచనప్రాయంగా వెల్లడించ డంతో అసలు కథ మొదలైంది. దీనికి తోడు యంగలీడర్స్ రాష్ట్ర అధ్యక్షుడు పైలెట్ రోహిత్‌రెడ్డి హస్తం గూటికి చేరడంతో నాయకుల మధ్య వివాదం మరింతగా ముదిరింది. పోటీకి రోహిత్‌రెడ్డి కూడా ఆసక్తి చూపుతుండడం, టికెట్‌కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండటంతో సీనియర్ నేతల్లో గుబులు పుట్టుకుంది.
ఈ పరిణామాలతో నిన్నమొన్నటి దాకా ఎడమొహం, పెడమొహంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, రమేష్, లక్ష్మారెడ్డి వర్గాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వీరంతా రెండురోజుల క్రితం స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి టీపీసీసీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, సబితారెడ్డిని కలిసి తమలో టికెట్ ఎవరికి ఇచ్చినా గెలుస్తామని, గెలిపిస్తామని చెప్పారు. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డికి అడ్డుకట్ట వేయడంలో తాత్కాలికంగా సఫలమయ్యారు. ఇదిలా ఉండగా టికెట్ మాత్రం తనకే వస్తుందని రోహిత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనా కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను ఖరారు చేయడంలో గెలుపు ప్రధాన గీటురాయిగా తీసుకుంటున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment