సాక్షి, ఢిల్లీ : నిజాం పాలనలో రజాకార్ల దురాగతాలు నేటికీ మర్చిపోలేని భయంకర దృశ్యాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమాన్ని బీజేపీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనీష్ తివారీ, తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయుధ పోరాటంలో పాల్గొన్న బైరాన్‌పల్లి గ్రామ సమరయోధులను ఆహ్వానించి వారికి సన్మానం చేశారు. ముందుగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారిందని విమర్శించారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తూ రజాకార్ల వ్యతిరేకులను, మలిదశ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బీజేపీ జెండా ఎగిరినప్పుడే సాయుధ పోరాట యోధులకు సరైన గుర్తింపు దక్కుతుందని వ్యాఖ్యానించారు. సెప్టెంబరు 17న గ్రామగ్రామాన ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాతీయ పతాకం ఎగరేస్తూ విమోచన దినోత్సవం నిర్వహించాలని పిలుపునిస్తున్నానని తెలిపారు.
తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణ భారతదేశంలో విలీనమైన రోజును రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని ప్రశ్నించారు. విమోచనంలో పాల్గొన్న వారి త్యాగాలను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసినట్టుగా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు. మురళీధర్ రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ సంస్థానం నుంచి విడిపోయి కర్ణాటక, మహారాష్ట్రలో కలిసిన జిల్లాలు విమోచన దినోత్సవాన్ని జరుపుకొంటున్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం ఎందుకు జరపట్లేదని నిలదీశారు. కాంగ్రెస్‌లాగా టీఆర్‌ఎస్ కూడా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. కేసీఆర్ అహంకార ధోరణికి అంతం పలికే రోజు ఎంతో దూరంలో లేదని బీజేపీ ఈ వేదిక నుంచి ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ సాయుధ పోరాట దృశ్యాల ఫోటో ప్రదర్శనను నాయకులు వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment