
సచ్చినా స్పందించరా..?
* నోళ్లు తెరిచిన నిరుపయోగ బోరుబావులు
* ‘గిరిజ ఘటన’తోనైనా అధికారులు కళ్లు తెరిచేనా..?
బషీరాబాద్: నిరుపయోగమైన బోరుబావులు నోళ్లు తెరి చాయి. గ్రామాలతో పాటు వ్యవసాయ పొలాల్లో బోరుబావుల్లో నీళ్లు పడకపోతే ప్రజలు కేసింగ్ పైపును తొలగించి అలాగే వదిలేస్తున్నారు. జనాల అవగాహన లేమి.. అధికారుల నిర్లక్ష్యంతో బోరుబావులు మృత్యుకుహరాలుగా మారి చిన్నారులను బలితీసుకుంటున్నాయి. వ్యవసాయాన్ని నమ్ముకున్న ‘మట్టి మనుషులు’ నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. బోరుబావుల్లో నీళ్లు పడేదాక రెండు, మూడు ఇలా తవ్విస్తున్నారు. నీళ్లు రాని వాటిని వదిలేస్తున్నారు.
బషీరాబాద్ మండల పరిధిలోని నవల్గ, దామర్‌చెడ్, కాశీంపూర్, మైల్వార్, ఎక్మాయి, మంతట్టి, గొటిగకుర్దుతో పాటు పలు గ్రామాల్లో నిరుపయోగమైన బోరుబావులు ప్రమాదకరంగా మారాయి. ఈనెల 12న మంచాల మండల కేంద్రంలో చిన్నారి గిరిజ బోరుబావిలో పడి అసువులు బాసిన విషయం తెలిసిందే. అధికారులు చేసిన విశ్వప్రయత్నాలు ఫలించకపోవడంతో కానరాని లోకాలకు వెళ్లింది. అధికారులు ‘గిరిజ ఘటన’తోనైనా కళ్లు తెరిచి జిల్లాలో నిరుపయోగంగా ఉన్న బోరుబావులను మూసివేయాలి.
ఈ ఫొటోలో కనిపిస్తున్న నోరు తెరిచిన బోరుబావి ఆత్కూర్ పాఠశాల ఆవరణలో ఉంది. తాగునీటి కోసం అధికారులు మూడు నెలల క్రితం బోరు తవ్వించారు. కాంట్రాక్టర్ పంపు బిగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. విద్యార్థులు బోరు ఉన్న పరిసరాల్లో నిత్యం ఆడుకుంటున్నా.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -పెద్దేముల్