రాజకీయ లబ్ధికోసమే వాళ్ల ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు రెండూ రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలపై తాము చర్చించామని, ముఖ్యమంత్రిని.. గవర్నర్ను కలిసి అన్ని అంశాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించామని ఆయన అన్నారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ లబ్ధికోసమే ప్రయత్నిస్తున్నాయని, ప్రజలు పడుతున్న కష్టాలు, వారి బాధలను పట్టించుకోవడం లేదని పొంగులేటి విమర్శించారు. వైఎస్ఆర్సీపీ మాత్రం ప్రజల పక్షాన ముందుండి పోరాడుతుందని ఆయన చెప్పారు. వచ్చేనెల 9వ తేదీన రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని పొంగులేటి డిమాండ్ చేశారు.
రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ వైఎస్ఆర్సీపీ నేతలు జనకప్రసాద్, కిష్టారెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు మూతపడి లక్షలాదిమంది కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే విద్యుత్ సమస్యను పరిష్కరించాలని కోరారు.