ప్రాణాలు తీసిన ఈత సరదా
వేర్వేరు చోట్ల ఆరుగురు మృత్యువాత
మద్నూర్/తలమడుగు/మేడ్చల్: దసరా సెలవుల్లో సరదాగా ఈతకు వెళ్లిన వారిని కుంట, నీటి గుంతలు మింగేశాయి. నిజామా బాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వేర్వేరుగా శనివారం ఆరుగురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటనలో అన్నదమ్ములు చనిపోయారు. మహారాష్ర్టలోని దెగ్లూర్ ఫూలేనగర్ కాలనీకి చెందిన సందేశ్(15), ప్రతీక్(13) స్థానిక హైస్కూల్‌లో చదువుతున్నారు. ఈత కొట్టాలని శుక్రవారం సైకిళ్లపై నిజామాబాద్ జిల్లా మద్నూర్ మండలం చిన శక్కర్గా శివారులోని కుంట వద్దకు వచ్చారు. ఇద్దరికీ ఈత రాకపోవడంతో కుంటనీటిలో మునిగిపోయారు.
సాయంత్రమైనా పిల్లలు ఇంటికి రాకపోవడంతో సందేశ్ తండ్రి గణేశ్, ప్రతీక్ తండ్రి మారిబా కాలనీలో వెదికారు. ఇద్దరూ ఈతకు వెళ్తున్నామని చెప్పారని పిల్లల స్నేహితులు చెప్పడంతో తల్లిదండ్రులు కుంట వద్ద వెళ్లారు. సైకిళ్లు ఒడ్డుపై ఉండడంతో కుంటలో పడిపోయారని భావించి వెతికే ప్రయత్నం చేయగా, భారీ వర్షంతో సాధ్యం కాలేదు. శనివారం గ్రామస్తుల సాయంతో కుంటలో వెతకగా ఇద్దరి మృతదేహాలు బయటపడ్డాయి.
ఆదిలాబాద్ జిల్లాలో...
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం దేవపూర్‌కి చెందిన రోడ ్డ అశోక్(16), రోడ్డ కార్తీక్(14) స్థానిక జెడ్పీ పాఠశాలలో 10వ, 7వ తరగతి చదువుతున్నారు. అదే పాఠశాలలో ఉషన్న 8వ తరగతి, సునీల్ 6వ తరగతి చదువుతున్నారు. అన్నదమ్ముల పిల్లలైన వీరంతా కలిసి గ్రామ సమీపంలోని పంట పొలాల్లో ఎడ్లు మేపేందుకు వెళ్లి వాటిని పొలంలో కట్టేశారు. రహదారి సమీపంలో తవ్విన గుంతలో ఈత కొట్టడానికి అశోక్, కార్తీక్, ఉషన్న దిగారు. సునీల్ ఒడ్డున ఉన్నాడు. ప్రమాదవశాత్తు ముగ్గురూ నీట మునిగిపోసాగారు. ఒడ్డున ఉన్న సునీల్ నీటిలోకి దిగి తన సోదరుడు ఉషన్నకు చేరుు ఇవ్వడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే అశోక్, కార్తీక్ నీట మునిగి చనిపోయూరు.
కాగా, కార్తీక్ తండ్రి చనిపోవడంతో తల్లి కూలీ పనులు చేస్తూ చదివిస్తోంది. బిహార్‌లోని మధుబని జిల్లా కొఠ్యా గ్రామానికి చెందిన బిహారీ చౌదరి, దుర్గ దంపతులు ఐదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా మేడ్చల్‌కు వలస వచ్చి ఇక్కడి పారిశ్రామికవాడలో నివాసం ఉంటున్నారు. చిన్న హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
వీరికి ముగ్గురు కుమారులు రాహుల్‌చౌదరి, రాజుచౌదరి, కరణ్‌చౌదరి, కూతురు కాజల్‌కుమారి ఉన్నారు. శనివారం వారి పెద్ద కుమారుడు రాహుల్‌చౌదరి (16), మూడో కుమారుడు కరణ్‌చౌదరి (9) స్నానం చేసేందుకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కండ్లకోయ ఔటర్ రింగురోడ్డు వద్ద రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా తీసిన గుంత వద్దకు సైకిల్‌పై వెళ్లారు. తమ వెంట రెండు నీటి డబ్బాలు కూడా తీసుకువెళ్లారు. స్నానం చేసేందుకు నీటిలోకి దిగిన రాహుల్‌చౌదరి, కరణ్‌చౌదరిలకు ఈత రాకపోవడం, నీటికుంట లోతుగా ఉండడం తో అందులో మునిగిపోయారు.