
కాసేపట్లో పెళ్లి... ప్రియురాలితో వరుడు జంప్
కామేపల్లి(ఖమ్మం): కాసేపట్లో పెళ్లి..కల్యాణ మండపం..బాజాభజంత్రీలు.. బంధుమిత్ర పరివారంతో అమ్మాయి ఇంట్లో హడావుడి..ఇంతలోనే షాక్. తన ప్రియురాలితో కలిసి పెళ్లి కొడుకు పరారయ్యాడన్న సమాచారం వధువు ఇంటికి చేరింది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గరిడేపల్లిలో బుధవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... గరిడేపల్లికి చెందిన భూక్యా మౌనికకు వరంగల్ జిల్లా కొరవి మండలం ఉప్పరిగూడెం పంచాయతీ మంజ్యాతండాకు చెందిన మాళోత్ శ్రీనివాస్‌తో పది రోజుల క్రితం వివాహం నిశ్చయమైంది.
వరకట్నంగా వరుడి కుటుంబసభ్యులు రూ.4 లక్షలు మాట్లాడుకున్నారు. దీనిలో రూ.3 లక్షలు వివాహానికి ముందే వధువు తల్లిదండ్రులు ముట్టజెప్పారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. వరుడు తెల్లవారుజామునే వధువు ఇంటికి రావాల్సి ఉంది. కానీ రాలేదు. ఆరా తీయగా ప్రేమించిన అమ్మాయితో పెళ్లికొడుకు పరారయ్యాడని వధువు కుటుంబానికి తెలిసింది. ఈ విషయం తెలిసిన వధువు కుటుంబసభ్యులు వరుడిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.