♦ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు విస్తృత ప్రచారం
♦ మొదటి విడతకు చివరి గడువు ఈ నెల 12
♦ అదే రోజు నుంచి తరగతుల ప్రారంభం
♦ రెండో విడతకు చివరి గడువు ఈనెల 30
♦ అడ్మిషన్లు పెరగాలని బోర్డు ఆదేశం
♦ గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్‌సిగ్నల్
నల్లగొండ/భువనగిరి :ఇంటర్ అడ్మిషన్లకు బోర్డు అనుమతిచ్చింది. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుండగానే ఇంటర్ ప్రవేశాలకు ఆమోదం లభించింది. ఈ ఏడాది ఆన్‌లైన్‌లో కాకుండా పాత పద్ధతిలోనే అడ్మిషన్‌లు స్వీకరించనున్నారు. అయితే అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీలకు మాత్రమే అడ్మిషన్ లాగిన్ ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. జిల్లాలోని ప్రైవేటు కాలేజీలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్తున్నప్పటికీ కొన్ని కాలేజీల విషయంలో మాత్రం లోటుపాట్లు ఉన్నాయని, వాటిని సవరించుకుని బోర్డు గుర్తింపు పత్రం పొందితే గానీ అడ్మిషన్ లాగిన్ ఇవ్వడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు. బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదటి విడత అడ్మిషన్లకు చివరి గడువు ఈ నెల 12 కాగా...అదే రోజు నుంచి కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలి. రెండో విడత అడ్మిషన్ల గడువు 30 వరకు అవకాశం కల్పించారు.
ప్రభుత్వ కాలేజీలు.. ప్రచార బాట
ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ ఫలితాలు మెరుగ్గానే ఉన్నందున ఈ ఏడాది అడ్మిషన్లు పెంచాలని బోర్డు సూచించింది. ప్రభుత్వ కాలేజీల్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను గ్రామాల్లో వివరించి వారిని రప్పించేందుకు ప్రిన్సిపల్స్, అధ్యాపకులు కృషి చేయాలని పేర్కొన్నారు. ఉపకార వేతనాలు, మౌలి క వసతులు, బస్‌పాస్, కంప్యూటర్ సౌకర్యం, విశాలమైన తరగతి గదులు, ఆర్‌ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి వసతి తదితర వాటి గురించి గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలి. కాలేజీ పరిధిలోని ప్రభుత్వ హైస్కూల్స్‌కు వెళ్లి పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల వివరాలను సేకరించి వారిని తమ కాలేజీల్లో చేర్పించేలా అధ్యాపకులు కృషి చేయాలి. ప్రతిరోజు కాలేజీలో చేర్పించిన విద్యార్థుల వివరాలను జిల్లా అధికారులకు పంపించాలి. ఆ సమాచారాన్ని జిల్లా అధికారులు బోర్డుకు పంపిస్తారు.
ఈసారి ‘గెస్ట్’లు ముందుగానే..
ప్రభుత్వ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టుల స్థానంలో గెస్ట్ లెక్చరర్స్‌ను ప్రతి ఏడాది సెప్టెంబర్‌లో నియమించేవారు. అయితే ఈ ఏడాది అలాకాకుండా ముందుగానే వారిని నియమించుకునేందుకు బోర్డు అనుమతిచ్చింది. ఇటీవల కాలంలో పదోన్నతులు పొందడం వల్ల ఖాళీ అయిన అధ్యాపకుల స్థానంలో గెస్ట్ లెక్చరర్లను కాలేజీలు తెరవగానే నియమించాలని పేర్కొంది.
ఈ నియామకాల
విషయంలో బోర్డు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. పీహెచ్‌డీ, ఎంఫిల్, బోధనలో
అనుభవం ఉన్న వారికి, స్థానికులకు తొలి
ప్రాధాన్యత ఇవ్వాలి. వీరికి కనీసం వేతనం నెలకు రూ.పది వేలు నిర్ణయించారు. సబ్జెక్టు నిపుణులు, సమీప కాలేజీ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఒక
కమిటీ వేసి గెస్ట్ లెక్చరర్స్‌ను నియమించాలని బోర్డు సూచించినట్లు నల్లగొండ డీఐఈఓ
హన్మంతరావు ‘సాక్షి’కి తెలిపారు.
మా కాలేజీలో చేరండి..!
Published Thu, Jun 8 2017 5:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM
Advertisement
Advertisement