పై చేయి మనదే బ్రదర్ !
‘జంప్ జిలానీ ... జన నేత గులామీ ..’ అంటూ వలస నేతలపై సెటైర్లు విసురుకుంటూ తెలంగాణ టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నరు. వరసబెట్టి ఎమ్మెల్యేలంతా పార్టీ మారినా, వారి అనుచరులంతా గులాబీ కండువాలు కప్పుకున్నా, నియోజకవర్గాలకు నియోజకవర్గాలు ఖాళీ అయినా... విశ్వాస ఘాతకులు పోతే పోయిండ్రు.. పైచేయి మాత్రం మనదే బ్రదర్ అంటూ ఒకరు భుజాలు ఒకరు చరుచుకుంటున్నరు. పార్టీ కేడర్‌లో ధైర్యం నింపేందుకు నానా తంటాలు పడుతున్న తెలంగాణ నాయకులు అసలు సిసలు సరుకే మిగిలిందని గొప్పలు పోతున్నరు.
అసలు పోయినోళ్లంతా ‘చచ్చినోళ్లతో సమానం మాకు..’ అని ఒక నాయకుడంటే.. ‘ తెలంగాణలో మనమే బలంగా ఉన్నాం..’ అంటూ మరో నాయకుడు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఏ నేత ఎప్పుడు గట్టుదాటుతాడో తెలియని అయోమయంలో ఉన్న పార్టీ నాయకత్వం, కార్యకర్తలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతోంది.... ఏ ఎన్నికల్లో పోటీ చేసినా, ఓడిపోవడం రివాజుగా మారినా.. ‘కింద పడ్డా పై చేయి మనదే..’ అని కేడర్‌ను సమాధాన పరుస్తున్నారు. ‘ వీళ్ల కథలు ఎవరికి తెలియదు. ప్యాకేజీ దొరకగానే వీళ్లు మాత్రం జంప్ చేయరా.. బంగారు తెలంగాణలో భాగస్వామ్యం అయ్యేందుకని నీతులు చెప్పరా ఏందీ..’ అంటూ కార్యకర్తలు తమ తీర్పు ఇచ్చేస్తున్నారు.