జిందాబాద్‌.. అహ్మదాబాద్‌ | BRTS Technology Construction in Hyderabad | Sakshi
Sakshi News home page

జిందాబాద్‌.. అహ్మదాబాద్‌

Published Tue, Feb 18 2020 8:15 AM | Last Updated on Tue, Feb 18 2020 8:15 AM

BRTS Technology Construction in Hyderabad - Sakshi

రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీఆర్‌టీఎస్‌ బస్సుల కోసం ప్రత్యేకంగా సిటీలోని మీడియన్‌ డివైడర్‌కు కుడి, ఎడమవైపున 3.5 మీటర్ల చొప్పున ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాలి. ఈ లేన్లలోకి బస్సులు తప్ప ఇతర వాహనాలు రాకపోవడం వల్ల ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా బస్సులు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి.

సాక్షి, సిటీబ్యూరో: కాలం మారుతోంది. నగరం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోంది. టెక్నాలజీ వేగం పుంజుకుంటోంది. అయినా మారుతున్న కాలంతో పాటు నగరవాసుల ప్రయాణం మాత్రం హాయిగా సాగడం లేదు. ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు క్లిష్టతరమవుతోంది. రోడ్డెక్కి తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు విద్యార్థుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికీ ట్రాఫిక్‌ చుక్కలు చూపెడుతోంది. ఈ బాధల నుంచి నగరవాసులకు విముక్తి కల్పించేందుకు హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (హెచ్‌ఎండీఏ) సంకల్పించింది. ఈమేరకు హెచ్‌ఎండీఏ నోడల్‌ ఏజెన్సీ అయిన  కాంప్రహెన్సివ్‌æ ట్రాన్స్‌పోర్ట్‌ స్టడీ (సీటీఎస్‌) తెరపైకి తీసుకొచ్చిన బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ (బీఆర్‌టీఎస్‌) సేవలను  అందించేందుకు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు,మెట్రో ఫీడర్, నగర శివారుల్లో ప్రాంతాలను గుర్తించే పనిని వేగిరం చేసింది.

బీఆర్‌టీఎస్‌ ఇలా...
అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్సు ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ (బీఆర్‌టీఎస్‌)ను అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏ సీటీఎస్‌ అధికారులు..సిటీలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ‘జనరద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బీఆర్‌టీఎస్‌ బస్సుల కోసం ప్రత్యేకంగా సిటీలోని మీడియన్‌ డివైడర్‌కు కుడి, ఎడమవైపున 3.5 మీటర్ల చొప్పున ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయాలి. ఈ లేన్లలోకి బస్సులు తప్ప ఇతర వాహనాలు రాకపోవడం వల్ల ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా బస్సులు వేగంతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతాయి. తక్కువ చార్జీలోనే సురక్షితంగా తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరడం వల్ల ఈ సేవలకు ఆదరణ పెరిగే ఛాన్స్‌ ఉంది. ఇతర వాహన చోదకులు కూడా వీటివైపు మళ్లే అవకాశముంది. మెట్రో స్టేషన్‌లో దిగిన చాలా మందికి తమ కార్యాలయాలు చేరేందుకు ఇటువంటి సేవలు కూడా ఎంతో ఉపయోగపడతాయి. సెపరేట్‌ కారిడార్‌లో బస్సులను నడపడం వల్ల ట్రాఫిక్‌ ఇబ్బందులు ఉండవు. బీఆర్‌టీఎస్‌ ముఖ్య ఉద్దేశం ఇదే.’ అని సీటీఎస్‌ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే తాము ఓఆర్‌ఆర్‌తో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలను అనుసంధానం చేస్తూ 418 కిలోమీటర్ల మేర బీఆర్‌టీఎస్‌ సేవలు విస్తరించాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు. ఇటీవల ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, మెట్రో ఫీడర్, నగర శివారుల్లో ప్రాంతాల్లోనూ బీఆర్‌టీఎస్‌ సేవలను విస్తరించాలన్న అంశం చర్చకు రావడంతో ఆవైపుగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. 

శివారు ప్రాంతాల్లో...
నగర శివారు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాట పడుతున్నందున ఆది నుంచే అక్కడ పక్కా ప్రణాళికతో ముందుకెళితే ట్రాఫిక్‌ కష్టాలు చెక్‌పెట్టవచ్చు. బీఆర్‌టీఎస్‌ సేవలు అక్కడ పరిచయం చేయడం వల్ల బస్సులు నడిపే ఆర్టీసీ సంస్థకు కూడా మంచి ఆదాయం వస్తుంది. ప్రయాణికులు కూడా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని సురక్షితంగా చేయగలరు. సిటీలోకి వచ్చే ప్రతిఒక్కరూ ఈ సేవలు వినియోగించుకునే అవకాశముంటుంది. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నగర శివారుల్లోని ప్రాంతాలను గుర్తించే పనిలో ఆర్టీసీ అధికారులు కూడా నిమగ్నమయ్యారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు వెడల్పు అంతటా ఒకేతీరున లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో అవసరాలకు అనుగుణంగా జనసమర్ధమున్న ప్రాంతాలను గుర్తించే పనిలో సీటీఎస్‌ సిబ్బంది నిమగ్నమైంది. మరో రెండు నెలల్లో బీఆర్‌టీఎస్‌ ప్రాంతాలను గుర్తించే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement